జ్ఞేయః స నిత్యసన్న్యాసీ యో న ద్వేష్టి న కాంక్షతి |
నిర్ద్వంద్వో హి మహాబాహో సుఖం బంధాత్ ప్రముచ్యతే ||
ద్వేషము నెంత మున్ మదిని వీడిన వానిని, కాంక్ష లన్నిటిన్
ద్వేషమొనర్చు వాని నిల నిత్తెపు జోగియటంచు నెంచగా
దోషము లేదు, జంటలను ద్రోసిన ముక్తుని కర్మబంధనా
శ్లేషణ మింతయేనియు జలింపగ జేయగజాల దర్జునా !
శ్రీమద్భగవద్గీత, అయిదవ అధ్యాయం, కర్మసన్యాస యోగం లోని మూడవ శ్లోక మిది.
సన్యాసం అంటే త్యజించటం, విడిచిపెట్టటం. కర్మ సన్యాసం అంటే, కర్మలను విడిచిపెట్టటం కాదు. కర్మఫలాన్ని విడిచిపెట్టడం. చేసిన పనుల వల్ల వచ్చే ఫలితాలను గురించి మథనపడకుండా ఉండటం. ఇవ్వడంలో ఉన్నంత తృప్తి వేరెక్కెడా లేదని తెలుసుకోవడం. ఈశావాస్యోపనిషత్తు చెప్పింది అదే. త్యాగంలో నిస్వార్థబుద్ధి ఉంటుంది. ' నా ' అనే హ్రస్వదృష్టి నశించి ' అందరూ ' అనే సమభావం మొలకెత్తుతుంది. అది జరగాలంటే కోరికలు నశించాలి. మమత్వం పోయి సమత్వం వచ్చినప్పుడు విశ్వమంతా విష్ణుమయంగా కనిపించి, మనస్సు నందనవనమౌతుంది.
భగవానుడు చెబుతున్నాడు.
" గొప్ప బాహువులు కల అర్జునా! ఎవడైతే దేనినీ ద్వేషభావంతో చూడడో, దేనినీ కోరడో, రాగద్వేషాలు, సుఖదుఃఖాలు, మానావమానాల వంటి ద్వంద్వ భావాలకు అతీతంగా ఉంటాడో, అతడు నిత్యసన్యాసి అని తెలియదగినవాడు. అటువంటివాడు కర్మబంధాలను చాల సులువుగా త్రెంచుకోగలుగుతాడు. "
పైన చెప్పినవన్నీ కర్మయోగి యొక్క లక్షణాలు. కర్మజీవికి కర్మయోగికి ఇదే తేడా.
కర్మజీవి బంధాలను పెంచుకుంటాడు. కర్మయోగి బంధాలను త్రెంచుకుంటాడు. కట్టుకొయ్యకు కట్టివేయబడిన పశువు కట్టుతాడును త్రెంచుకోవాలన్న ప్రయత్నంలో, కట్టుకొయ్య చుట్టూ తిరిగి ఇంకా నాలుగు చుట్టులను యెక్కువ వేసుకుంటుంది. కర్మబద్ధుని యొక్క పరిస్థితీ యిదే. తనకు శాశ్వతమైన సుఖాన్ని ఇచ్చేదేదో తెలియక, సంసార బంధాలను పెంచుకుంటూపోతాడు. సంసారబంధాలు పెరిగినకొద్దీ, అవి దుఃఖకారణాలౌతాయి. మానవుడి దుఃఖానికి అతడి అంతులేని కోరికలే కారణం. జీవనం సాగించటానికి అవసరమైనవి గాక, అంతకు మించిన కోరికలు కోరుకొని, అవి సమకూరనప్పుడు అసంతృప్తికి, అసహనానికి గురౌతాడు. అప్పుడు, సరైన సమయం కోసం కాచుకొని ఉన్న అంతఃశత్రువులు విజృంభిస్తారు. జీవుడు అరిషడ్వర్గాలకు లోబడిపోతాడు. సుఖమో దుఃఖమో, రాగమో ద్వేషమో, మానమో అవమానమో కలుగుతుంది. ఈ అంతఃశత్రువులకు లోబడకుండా, ద్వంద్వాలకు అతీతంగా ఉన్నవాడే నిత్యసన్న్యాసి, నిత్యసంతోషి అనబడతాడు. అటువంటివాడు, గృహస్థాశ్రమంలో ఉన్నా సన్యాసిగానే పరిగణింపబడతాడు. కోరికలను జయించలేనివాడు, ద్వంద్వాలకు అతీతుడు కానివాడు, కాషాయవస్త్రధారణ చేసినా, యదార్థంగా సన్న్యాసి కాలేడు. అది వట్టి బాహ్యాడంబరమే ననవలసివస్తుంది.
వర్తమానకాలంలో, గృహస్థాశ్రమంలో ఉండి కూడా కర్మయోగిగా మన్ననలు పొందిన సద్గురు శివానందమూర్తిగారి వంటివారు దీనికి చక్కని ఉదాహరణ.
No comments:
Post a Comment