బలితపు గుబ్బగుబ్బలులపై నిర వొంది మెఱుంగుదీగెచే
నలరి హృతాబ్జపూగరుచియై నిరవద్యకలారవామృతం
బుల కలిమిం బికాంగనల మూకకు మూకత సంఘటించు నీ
చిలుకలకొల్కికంధర భజింపగ జెల్లదె కంధరాంకమున్.
రామరాజభూషణుని ఏ పద్యమైనా కొంచెం లోతుగా పరిశీలించి ఆనందించాల్సిందే కానీ, ఆషామాషీగా చదివితే అర్థమయ్యేది కాదు. ఒక్కసారి పద్యభావం పట్టుబడిన తరువాత, ఆ రసప్రవాహంలో కొట్టుకుపోవాల్సిందే గాని అందులో నుంచి బయటపడటం అంత సులువు కాదు. ఎందుకంటే, భట్టుమూర్తి శ్లేష మహిమ అటువంటిది. ఎవరైనా, ఆ మహాకవికి, సంగీతసమ్రాట్టుకు చేతులు మోడ్చాల్సిందే.
వసుచరిత్రము, ద్వితీయాశ్వాసంలోని గిరికాసౌందర్య వర్ణన చేసిన యీ పద్యం చూడండి.
ఈ పద్యంలో వాడిన ' కంధర ' శబ్దానికి, మేఘము, కంఠము అని రెండర్థా లున్నాయి.
ముందుగా మేఘపరంగా అర్థం చెప్పుకొందాము.
" కొండల మీద సంచరిస్తూ, మెరుపులతో ప్రకాశిస్తూ, హరింపబడిన పద్మసమూహ శోభ గలదై, అనింద్యమైన గర్జారవము, జలసందోహము యొక్క సంపద చేత, తమ మూగతనానికి సిగ్గుపడుతున్న కోయిలల సమూహంతో, కంధరమనే మేఘం, నామసామ్యంతోను , వృత్తిసామ్యంతోను, కంధరాకంగా వ్యవహరింపబడింది. "
మేఘానికి పద్మానికి విరుద్ధం. వర్షఋతువులో పద్మం నిగారింపు కోల్పోతుంది. వర్షఋతువులో కోయిలలు కూయవు. వసంతం వస్తేనే కోకిలారావాలు వినబడతాయి.
ఇక గిరిక యొక్క శంఖాన్ని పోలిన కంఠ పరంగా అర్థం అన్వయించుకొందాం.
" కొండల వలె ఉన్నతంగా ఉన్న చనుగుబ్బల పై భాగంలో ఉంటూ, తళతళ లాడే నగలతో ప్రకాశిస్తూ, హరింపబడిన శంఖం యొక్క, పోకచెట్టు కుత్తుక యొక్క శోభతో, అవ్యక్త మధురమైన, అమృతప్రాయమైన స్వరసంపుటితో, ఆడుకోయిలలకు మూగతనాన్ని సంఘటించి, సిగ్గుపడేటట్లు చేస్తూ, గిరిక అనే యీ ముద్దుగుమ్మ యొక్క కంఠం, కంధరమనే మేఘనామాన్ని కలిగి ఉండటం సమంజసమే కదా ! "
సౌందర్యవతియైన స్త్రీ కంఠం శంఖం లాగా, పోకచెట్టు కుత్తుక లాగా ఉందనటం ఎంతో చక్కగా ఉంది. కోయిలలు మూగబోయాయనటంలో, గిరిక కంఠమాధుర్యం ముందు కోయిలస్వరం పనికి రాదని అర్థం.
అహో ! ఏమి భట్టుమూర్తి? ఏమి తెలుగువారి అదృష్టం?
No comments:
Post a Comment