సిగ్గొకయింత లేక వెలచేడియ కైవడి ధర్మకీర్తులన్
బొగ్గులు చేసి జారు శశిఁ బొంది కటా ! కడుపేల దెచ్చుకొం
టెగ్గుఁ దలంపగా వలదె? యిప్పుడు గర్భము దించికొమ్ము
నిన్ మ్రగ్గగ జేసెదం జెనటి ! మానవతుల్ నినుఁ జూచి మెత్తురే?
శ్రీ మదాంధ్ర మహాభాగవతము, నవమస్కంధంలో చంద్రవంశం ఎలా ప్రారంభమైందో చెప్పబడింది.
శ్రీ మహావిష్ణువు నాభికమలం నుంచి బ్రహ్మదేవుడు పుట్టాడు. బ్రహ్మ మానసపుత్రుడు అత్రి. అతనికి చంద్రుడు పుట్టాడు. చంద్రుడు దేవగురువైన బృహస్పతి భార్యను మోహించి ఎత్తుకెళ్ళాడు. బృహస్పతి ఎంత వేడుకొన్నా చంద్రుడు ఆమెను వదిలిపెట్టలేదు. రాక్షసుల కారణంగా, బృహస్పతితో వైరం ఉన్న రాక్షసుల గురువు శుక్రుడు చంద్రుని పక్షం, శివుడు, ఇంద్రాది దేవతలు, బృహస్పతి పక్షం వహించారు. ఈ కారణంగా దేవదానవ యుద్ధం కూడా జరిగింది. చివరికి, బృహస్పతి తండ్రి అంగిరసుడు బ్రహ్మదేవునికి యీ విషయాన్ని చెప్పగా, బ్రహ్మ వెళ్ళి చంద్రుడిని మందలించి గర్భవతిగా ఉన్న తారను బృహస్పతికి ఇప్పించాడు. ఈ పరిణామాలతో కలత చెందిన బృహస్పతి భార్యతో ఇలా అంటున్నాడు.
" ఓసీ నీచురాలా ! సిగ్గూఎగ్గూ వదిలేసి ఒక వేశ్యలాగా, ధర్మ మార్గాన్ని, కీర్తిప్రతిష్ఠలను మంటలో కలిపి, ఆ వ్యభిచారి చంద్రుడితో కడుపు తెచ్చుకొన్నావు. ఇది పాపమని నీకు తెలియదా? ఇప్పుడు కడుపు తీయించుకో. కులటా ! నిన్ను కాల్చేస్తాను. శీలం కలవాళ్ళు నిన్ను చూసి మెచ్చుకోరు. "
లోతుగా విశ్లేషిస్తే, పురాణగాథలలో కార్యకారణ సంబంధ ముంటుంది. చంద్రవంశం ఆవిర్భావానికి తారాశశాంకుల కలయిక ఒక ప్రాతిపదిక అని అనుకోవచ్చు.
పూర్వం రోజుల్లో, తెలుగునాట తారాశశాంకం చాలా ప్రసిద్ధి వహించిన నాటకం.
No comments:
Post a Comment