చరణయుగంబు దొట్రువడ సంభృత శోకత రాజవీథి నె
వ్వరిగనియైన హా మహితవైభవ హా ధృతరాష్ట్రపుత్ర ! హా
కరిపురనాథ ! యం చెలుగు గద్గదికం దగులంగ నేడ్చుచున్.
పదహేడవ రోజు యుద్ధంలో కర్ణుడు వీరమరణం పొందాడు. దుర్యోధనుడు దుఃఖంతో క్రుంగిపోయాడు. ఆ తరువాత, శల్యుడిని సర్వసైన్యాధ్యక్షుడిని చేసి, ఉన్న కొద్ది సేనలను సమీకరించుకొని, పద్దెనిమిదవ రోజున యుద్ధానికి వెళ్ళారు. ఆ మధాహ్నానికల్లా, శల్యుడు ధర్మరాజు చేతిలో మరణించాడు. ఇక దుర్యోధనుడు యుద్ధం చాలించి, భయంతో ఒక మడుగులో దాగికొన్నాడు. వెతుక్కుంటూ మడుగు వద్దకు వచ్చిన పాండవులు అతడిని సూటిపోటి మాటలన్నారు. దుర్యోధనుడు అభిమానధనుడు కనుక, మడుగు నుండి బయటకు వచ్చి భీముడితో గదాయుద్ధం చేశాడు. భీముడు దుర్యోధనుడి తొడలను విరుగగొట్టి ప్రతిజ్ఞను నెరవేర్చుకొన్నాడు. దుర్యోధనుని పతనం సహించలేని అశ్వత్థామ, నిద్రిస్తున్న ఉపపాండవులను చంపివేసాడు. ఆ మరుసటిరోజు మధ్యాహ్నానికల్లా సంజయుడు హస్తినాపురం చేరుకున్నాడు. హస్తినాపురాన్ని, ఆ పురాధీశ్వరుడైన కురుసార్వభౌముడిని తలచుకొని, సంజయుడు దుఃఖాన్ని ప్రకటించటమే యీ పద్యం యొక్క తాత్పర్యం.
" కురుక్షేత్రం నుండి హస్తినాపురం చేరుకొన్న సంజయుని ముఖం కన్నీటి ధారలతో నిండిపోయింది. హస్తినాపుర రాజవీథులలో నడుస్తూ మాటిమాటికీ చేతులు పైకెత్తి, తొట్రుపాటుతో, అమిత దుఃఖభారంతో, యెవరు కనపడినా ' హా మహితవైభవా ! హా ధృతరాష్ట్రపుత్రా ! హా ! హస్తినాపురాధీశ్వరా ! అంటూ గద్గదస్వరంతో ఎలుగెత్తి ఏడవసాగాడు. "
దుర్యోధనుడు ఎంత చెడ్డవాడైనా, అసూయాగ్రస్తుడైనా, అది పాండవుల వరకే పరిమితం. తనను నమ్మినవారికిబతడు స్నేహాన్ని, సౌహార్దాన్ని పుష్కలంగా పంచిపెట్టాడు. వీటన్నింటికీ మించి, అతడు ప్రజారంజకుడైన ప్రభువు. దానికితోడు, కురువీరులందరూ సంజయుని కన్నుల ముందు పెరిగి పెద్దయినవారు. అందువల్ల, సంజయుడు హస్తినాపుర రాజవీధులకు రాగానే, పెల్లుబికిన దుఃఖం రావటం అతి సహజమైన పరిణామం. ఆ దుఃఖాతిశయాన్ని ఒడిసిపట్టి, పొరలి పొరలి వస్తున్నట్లుగా, అలతి అలతి పదాలలో, హృదయానికి హత్తుకొనేటట్లుగా చిత్రించారు తిక్కనగారు.
ఈ పద్యం శ్రీమదాంధ్ర మహాభారతము, శల్యపర్వము, ప్రథమాశ్వాసములో ఉంది.
No comments:
Post a Comment