అన విని యమ్మునీంద్రునకు నవ్విభుఁ డిట్లనుఁ " బాపశాలి స
జ్జన సతతాపకారి కులసంక్షయ కారణరోషభాగి యి
మ్మనుజవరాధముం డితఁ డమర్త్యుల కెల్లను మాననీయుఁడై
మనునటె పుణ్యలోకమున? మాటల్ వేయును నేల సంయమీ !
వైశంపాయనుడు జనమేజయునికి స్వర్గలోకంలో కౌరవపాండవులు ఏ విధంగా ఉన్నారో వివరించి చెబుతున్నాడు.
బంధుజనాలను చూడాలనుకొన్న ధర్మరాజు కోరిక మేరకు, ఇంద్రుడు ఒక దూతను వెంట ఇచ్చి స్వర్గలోకం చూడటానికి పంపించాడు. అక్కడున్న నారదాది మహర్షులు కొందరు ఆయన వెంట వెళ్ళారు. ధర్మరాజుకు మందుగా, నవరత్నఖచిత సింహాసనం మీద కూర్చొని, సూర్యకాంతితో వెలిగిపోతూ, అప్సరస్త్రీల చేత పరివృతుడై ఉన్న దుర్యోధనుడు కనుపించాడు. దుర్యోధనుడిని చూడగానే ధర్మరాజుకు అతడి పాపకృత్యాలన్ని గుర్తుకువచ్చి నారదుడితో ఇలా అంటున్నాడు.
" ఓ నారదమునీంద్రా ! ఇతడెన్నో పాపాలు చేశాడు. మంచివారి కెప్పుడూ అపకారం తలపెట్టేవాడు. వంశం నశించటానికి కారణమైన ద్వేషభావం కలిగినవాడు. ఇటువంటి రాజాధముడు దేవతలందరికీ పూజనీయుడై యీ స్వర్గలోకంలో ఉండటమా? ఇంకా ఇన్ని మాటలెందుకు? "
ధర్మరాజు ధర్మానికి ప్రతిరూపం. అందుకే దేహంతో స్వర్గానికి చేరుకున్నాడు. అయితే అతనిలో కొద్దిగా మిగిలిఉన్న మానుషభావాలు నశించలేదు. అందుకే, ఆ విధంగా మాట్లాడాడు. ఆ మానుషభావాలు నశిస్తే ఆయన పరిపూర్ణుడౌతాడు.
అందుకే నారదుడు, దేవలోకంలో సమత్వం ఉంటుంది కానీ, ద్వంద్వాలకు తావులేదని చెప్పాడు. అదీకాక, సూర్యమండలాన్ని ఛేదించుకొని ఉన్నతలోకాలకు వెళ్ళే అర్హత ఇద్దరికే ఉందని శాస్త్రాలు చెబుతున్నాయి. అందులో ఒకరు సన్యాసి కాగా, రెండవవారు యుద్ధంలో వీరమరణంపొందినవాడు. ధర్మరాజులో మానుషభావాలు నశించటానికి అవసరమైన, శోధన, తదనంతర ప్రక్షాళన జరిగే సన్నివేశాలు స్వర్గారోహణ పర్వంలో చూస్తాము.
No comments:
Post a Comment