రాత్రిమై దాకి క్రూరత బోర మగటిమి
వాసిన అంగపర్ణు కంటె
ఘోషయాత్రావిధి గురురాజు జెఱ పట్టి
మాన మేదిన చిత్రసేను కంటె
ఖాండవోద్యానంబు గావ నేరక సిగ్గు
వడి చన్న నిర్జరప్రభుని కంటె
గ్రీడాకిరాతు డై క్రోడంబునకు గాగ
బెనగి చిక్కిన త్రిలోచనుని కంటె
నెక్కుడైన వీరు డే నర్జునునితోడ
బొడుతు నొడుతు ననిన బోలు గాక
వినుము సూతతనయ ! మన బోటు లాతని
జెఱుతు మనుట నోరిచేటు గాదె?
నిర్జరులు = దేవతలు
క్రోడము = వరాహము; అడవిపంది.
ఈ పద్యంలో నాలుగు సంఘటన లున్నాయి. అవి అంగారపర్ణుడి, చిత్రసేనుడి, ఖాండవదహన, కిరాతార్జునీయ కథలు.
ఉపప్లావ్యంలో ఉన్నప్పుడు ధర్మరాజు శల్యుడి దగ్గర మాట తీసుకున్నాడు. కర్ణుడి రథసారథ్యం చేస్తూ, అతడిని సూటిపోటి మాటలతో నిరుత్సాహపరుస్తానన్నాడు. యుద్ధభూమిలో కర్ణుడి రథం నడుపుతూ, శల్యుడు మాటిమాటికీ కౌరవుల భంగపాటును, అర్జునుని పరాక్రమాన్ని గుర్తు చేస్తున్నాడు. శల్యుడు కర్ణుడి రథాన్ని నడుపుతాననటమే కర్ణుని దురదృష్టం. శల్యుడేమంటున్నాడో చూడండి.
" రాత్రిపూట యుద్ధం చేసి ఓడిపోయిన అంగారపర్ణుడికన్నా, ఘోషయాత్రలో దుర్యోధనుడిని బంధించి భంగపడిన చిత్రసేనుడికన్నా, ఖాండవ వనాన్ని దహించినపుడు రక్షించలేక వెన్నుజూపిన ఇంద్రునికన్నా, కిరాతరాజు వేషంలో వరాహం కోసం పోరాడి ఓడిన శివునికన్నా గొప్పవాడివైతే, అర్జునుడితో పోరాడుతాను, గెలుస్తాను అనటం చెప్పడానికి వినడానికి బాగుంటుంది కానీ, మనవంటివారం అతడిని గెలుస్తామనటం నోటి దురద తీర్చుకోవడనికి మాట్లాడింది తప్ప ఇంకొకటి కాదు. "
మొదటిది అంగారపర్ణుని కథ. అరణ్యవాసకాలంలో, పాండవులు రాత్రివేళ తన ప్రాంతమైన అడవిలో ప్రవేశించారని , కుబేరుని మిత్రుడైన గంధర్వుడు అంగారపర్ణుడు, అర్జునుడితో తలపడి ఓడిపోయాడు. రెండవది కౌరవుల ఘోషయాత్ర. ద్వైతవనంలో ఉన్న పాండవులను అవమానిద్దామన్న దురుద్దేశంతో ఘోషయాత్ర చేశారు దుర్యోధనాదులు. ఆ సమయంలో వారు చిత్రసేనుడనే వాని చేత బంధింపబడి, భీమార్జునుల చేత విడిపింపబడ్డారు. అగ్నిమాంద్యాన్ని తగ్గించుకొనడానికై, కృష్ణార్జునుల సహాయంతో ఖాండవ వనాన్ని దహిస్తున్నప్పుడు, ఆ వనాన్ని రక్షించడానికి వచ్చి అర్జునుడి ప్రతాపానికి వెరచి పారిపోయాడు ఇంద్రుడు. చివరిది, కిరాతార్జునీయం. పాశుపతాస్త్రం కోసం, మాయాకిరాతుడి వేషంలో అర్జునుడితో పోరాడి, అతడి శౌర్యాన్ని చవి చూసాడు శివుడు.
ఈ సన్నివేశాలను గుర్తుచేస్తూ కర్ణుడు అర్జునుడికి సాటి కాదన్నాడు శల్యుడు. అంతేకాదు, అతడిని ' సూతతనయ ' అని సంబోధించి కించపరిచాడు. కర్ణుడు తన ప్రతాపాన్ని గురించి తనే గొప్పలు చెప్పుకోవటం నోటిచేటు అని తేల్చిపారేశాడు. ఇవన్నీ, శల్యుని వ్యూహంలో భాగమే. యుద్ధరంగంలో సారథి రథిని ఉత్సాహపరచాలి. దానికి విరుద్ధంగా జరిగింది కర్ణుడి విషయంలో. అప్పటినుండి, ఎవరైనా హితుని వలె నటిస్తూ, అడ్డంకులు సృష్టిస్తూ ఉంటే దానిని ' శల్య సారథ్యం ' అనటం పరిపాటయింది.
' సూతతనయ ' అనే సంబోధన, ' నోటిచేటు ' అనే చక్కని జాతీయం, ' పొడుతు నొడుతు ' అనే అచ్చ తెలుగుపదాలు పద్యానికి వన్నె తెచ్చిపెట్టాయి.
ఈ సీస పద్యం శ్రీమదాంధ్ర మహాభారతము, కర్ణపర్వము, ద్వితీయాశ్వాసంలో ఉంది.
No comments:
Post a Comment