దీక్షఁ గైకొని వ్రతయుక్తి ధృతమనో వి
నిశ్చయాత్మవు సుతుకోర్కి నెగెడెదేని
ఫలముఁగందువు పొలములో వాన యొక్క
చెక్కఁ గుఱిసి వేఱొకచెక్కఁ జుక్కపడదె !
అనిన సుమిత్రయున్ బ్రహసితానన పట్టపురాణికక్కకున్
దనయుఁడు గల్గుటొక్కటియు నాకును గల్గుట యొక్కటా ! భవ
త్తనయుఁడు నీదు భార్యలకు దాఁ దనయుండె యగున్ గదా యటై
నను నిను మెచ్చఁజేయఁగను నాకును సంతతిఁ గోరెదన్ ప్రభూ !
వశిష్ఠులవారు పుత్రకామేష్టి చేయించి, తన మంత్రశక్తితో నారాయణుడిని పుత్రునిగా పొందేటట్లు సంకల్పం చేస్తానని దశరథునికి వాగ్దానం చేశాడు. దశరథుని ఆనందానికి పట్టపగ్గాలు లేవు. వెంటనే కౌసల్యాగృహానికి వెళ్ళి, ఈ వార్తను చెప్పి, పవిత్రమైన యజ్ఞహవిస్సును అందుకొనటానికి వచ్చే వెన్నుడిని సంతోషపరచటానికి, పట్టుపీతాంబరాలు, ఆభరణాలు ధరించి, దేవతలకు తల్లి అయిన అదితి వలె కనుపించాలని చెప్పాడు. తరువాత సుమిత్ర దగ్గరకు వెళ్ళి ఇలా అన్నాడు.
" యజ్ఞ దీక్ష చేపట్టి, వ్రతాన్ని ఆచరించి, పుత్రుడు కావాలని గట్టిగా సంకల్పించావంటే, ఫలితం తప్పక కలుగుతుంది. పొలంలో ఒక వైపు వానకురిసి ఇంకొక వైపు పడకుండా ఉంటుందా? "
ఈ మాట వినగానే, మంచి చిరునవ్వుతో, సుమిత్ర ఇలా అన్నది.
" నాథా ! పట్టపురాణి అయిన అక్క కౌసల్యకు కొడుకు పుడితే ఒకటీ, నాకు పుడితే ఇంకొకటీ ఎలా అవుతుంది. నీ కొడుకు , నీ భార్యలు అందరికీ కూడా కొడుకే కదా ! అయినా కూడా, మీ సంతోషం కోసం, నాకు కూడా సంతానం కలగాలని సంకల్పం చేస్తాను. "
దశరథుడు, సుమిత్రకు సంతానం కావాలని కోరుతూ " పొలములో యొక్క చెక్క వాన గుఱిసి వేఱొక చెక్క జుక్క పడదె? " అన్న మాట విశ్వనాథవారి సందర్భోచితంగా అలంకారాలను వాడే ప్రతిభను తెలియజేస్తున్నది.
శ్రీమద్రామాయణ కల్పవృక్షము, బాల కాండము, ఇష్టి ఖండములోని పై పద్యాలలో సుమిత్రాదేవి యొక్క ఉపాసనాస్వరూపం మరొకసారి నిరూపితమయింది. ఆమె కౌసల్యను అనుసరించి, ఆమెకు కలిగిన సుఖదుఃఖానుభూతులు, తనకు జరిగినట్లుగా భావిస్తూ, అన్నిటినీ సమన్వయం చేసే నేర్పు, ఓర్పు కలిగిన, పేరుకు తగ్గ పెన్నిధి అనదగిన, మంచి మిత్రురాలు, సుమిత్ర.
అందువల్లనే, ' ప్రహసితానన ' అన్న పదంలో ఉపసర్గ వాడారు. ఆమె ప్రసన్నత కలిగించే చిరునవ్వు చిందించే ముఖము కలది. అంటే, ఆమెది అంత ప్రసన్నవదనం.
" భవత్తనయుండు నీదు భార్యలకు దా దనయుండె యగున్ గదా ! ". అహో ! ఏమి విశ్వనాథ ! పద్యం చదుతుంటేనే, శాంతభావం ఉప్పొంగిపోతున్నది. విశ్వనాథవారు చెప్పుకొన్నట్లు, తన రామాయణం ద్వారా తెలుగుజాతిని ఉద్ధరించటానికి భూమిపై జన్మనెత్తిన, కవితాతపస్సు చేసిన, భ్రష్టయోగియా? లేక ద్రష్టయైన ఋషీశ్వరుడా?
No comments:
Post a Comment