యజ్ఞశిష్టాశినః సంతో ముచ్యంతే సర్వకిల్బిషైః |
భుఞ్ఙతే తే త్వఘం పాపా యే పచంత్యాత్మకారణాత్. ||
యజన శేషమైన యన్నంబు భుజియించు
సజ్జనుల యఘములు సమసిపోవు
నెవ రన్నముఁ బచియింత్రు వారి కొరకె,
వారె పాపు, లొందు వారి నఘము.
శ్రీమద్భగవద్గీతలో కర్మయోగమనే పేరు గల మూడవ అధ్యాయంలోని పదమూడవ శ్లోక మిది.
ఇందులో భగవానుడు, మనం ఏ పని చేసినా త్యాగబుద్ధితో, యజ్ఞార్థంగా చెయ్యాలని శలవిచ్చాడు.
" యజ్ఞం చేసిన తరువాత యజ్ఞశేషాన్ని, అంటే, మిగిలిన పదార్థాన్ని భుజించే సజ్జనులు సమస్త పాపాల నుండి విముక్తులౌతున్నారు. అదే, తమ శరీరపోషణ కొరకే ఆహారాన్ని సిద్ధపరచుకొని భుజించేవారు, పాపపు కూడునే తింటున్న వారవుతున్నారు. "
భగవద్గీతలో చాలా చోట్ల, ' యజ్ఞము, యజ్ఞార్థము ' అనే మాటలు కనిపిస్తాయి. లోకంలో, యజ్ఞానికి, యాగమనీ, క్రతువనీ, అర్థాలున్నాయి. ఇక్కడ యజ్ఞమంటే భగవదర్పణగా, భగవంతుని ప్రీతి కొరకు చేసేది. భగవంతుడు దేనిని ఇష్టపడతాడు? భగవంతుడు సర్వభూతాంతరాత్మకుడు. అంటే, అన్నీ ప్రాణుల యందు ఉండేవాడు. అందువలన, సర్వప్రాణులకు ఇష్టమైనది చేస్తేనే, ఆయన సంతుష్టుడౌతాడు. అందువలన, మనం ఏ పని చేసినా, యజ్ఞార్థంగా, భగత్ప్రీతికరంగా చేస్తే, అది భగవంతునికి చెందుతుంది. నిస్వార్థంగా చేసే ప్రతిపనీ యజ్ఞార్థం, యజ్ఞశేషాన్నమౌతుంది. అదే స్వార్థంగా, మన కొరకే చేస్తే, అది పాపపు కూడవుతుందని భగవానుడు చెబుతున్నాడు.
సనాతనధర్మం పంచ మహా యజ్ఞాలను గురించి చెబుతుంది. అందులో భూతయజ్ఞ మనేది చాలా ముఖ్యమైనది, భగవంతునకు అత్యంత ప్రీతికరమైనది.
ఇదే విషయాన్ని ఈశావాస్యోపనిషత్తు " తేన త్యక్తేన భుఞ్ఙీథా " , " నీ కున్నదానిలో కొంతభాగం ఇతరులకు పంచి భుజింపుము" అని త్యాగము యొక్క గొప్పతనాన్ని ఉగ్గడించింది.
ఒక కవి, ఈ ఉపనిషత్సారాన్ని, " ఇచ్చుటలో నున్న హాయి వేరెచ్చటను లేనే లేదని " అన్నాడు. ఈ ఆనందం అనిర్వచనీయం, అనుభవైకవేద్యం.
No comments:
Post a Comment