యస్త్వింద్రియాణి మనసా నియమ్యారభతేర్జున |
కర్మేంద్రియైః కర్మయోగ మసక్తస్స విశిష్యతే ||
ఎవడు కర్మేంద్రియమ్ముల నెదనడంచి
అవని నిష్కాముడగుడు దానాశ విడచి
కర్మముల జేయుచుండెడు నిర్మలాత్ము
డతని, ననదగు " నుత్తము " డంచు పార్థ !
భగవద్గీతలోని పలు శ్లోకాలు నిర్ద్వంద్వంగా చెప్పేది ఒక్కటే. అదే, ఇంద్రియాలను వశపరచుకొని, తద్వారా మనోజయం సాధించటం.
ఈ శ్లోకంలో కూడా భగవానుడు ఈ విషయాన్నే నొక్కి చెపుతున్నాడు.
" ఓ అర్జునా ! ఎవడైతే ఇంద్రియాలను వశపరచుకొని, తద్వారా మనస్సుపై పట్టు సాధించి, సంగరహితుడై కర్మయోగాన్ని ఆచరిస్తాడో, వాడే ఉత్తముడనబడతాడు. "
శ్లోకంలోని రెండు ప్రయోగాలను జాగ్రత్తగా పరిశీలిస్తే ఒక విషయం సుస్పష్టమౌతుంది. ఒక్క కర్మేంద్రియాలనే వశపరచుకుంటే కర్మయోగం ఆచరించినట్లు కాదు. ఎందువలననగా, కర్మేంద్రియాలు వాటి వాటి వ్యాపారాలను నిర్వహించకపోతే, జీవనవ్యాపారం సాగదు. అందువల్ల, భగవానుడు జ్ఞానేంద్రియాలను కూడా చక్కగా నియమించుకోవాలని చెబుతున్నాడు. అప్పుడే మనోజయం సాధ్యమౌతుంది. ఈ విధమైన కర్మయోగాన్ని సంగ వివర్జితుడై ఆచరించాలి. అంటే రాగద్వేషాలను విడిచిపెట్టి పను లన్నిటినీ భగవదర్పణంగా చేయాలి. అంటే, మనం చేసే నిత్య నైమిత్తిక కర్మలన్నీ చేస్తూ, దేహవ్యాపారాలైన తినటం, నిద్రించటం, నడవటం, కూర్చొనటం వంటివన్నీ విహిత శాస్త్రవిధి ననుసరించి, భగవదర్పణగా చేయాలి. ఆ విధంగా చేసినవాడు " ఉత్తముడు " అని పిలువబడతాడని భగవానుడు చెబుతున్నాడు.
ఈ శ్లోకంలో " నియమ్య " అన్న పదం చాలా ప్రాముఖ్యత కలిగినది. ఇంద్రియాలను ఓర్పుతో, నేర్పుతో, వశపరచుకోవాలి కానీ, నిరోధించకూడదు. నిరోధిస్తే అవి అదుపుతప్పిన గుర్రాల లాగా ఎదురు తిరుగుతాయి. ఇంద్రియాలను నేర్పుతో వశపరచుకొని, మనోజయం సాధించాలని భగవానుని భావం. అది జరగాలంటే కర్మయోగ సాధకుడు అసక్తుడై ఉండాలి. దేనియందూ ఆసక్తి గానీ, ద్వేషం కానీ లేకుండా ఉండాలి. అదే శ్రేష్ఠమైన విధానం.
ఇదీ శ్రీమద్భగవద్గీత, కర్మయోగం లోని ఏడవ శ్లోకం. శ్లోకానికి తెలుగు పద్యానువాదం చేసినది శ్రీ లొల్లా సుబ్బరామయ్యగారు.
No comments:
Post a Comment