వర వృషకేతనుండు భగవంతుఁడు నైన హరుండు నన్ను నా
దరపరిహాస వాక్యముల దక్షతనూభవ యంచుఁ బిల్వఁ నేఁ
బురపురఁ బొక్కుచున్ ముదముఁ బొందక నర్మవచఃస్మితంబులం
దొఱఁగుదు, నీ తనూజ నను దుఃఖము కంటెను జచ్చు టొప్పగున్.
పుట్టినింటి మమకారాన్ని చంపుకోలేక, భర్త వారించినా, తన తండ్రి దక్షుడు చేసే యాగానికి వెళ్ళింది సతీదేవి. గర్వంతో మిడిసిపడుతున్న దక్షుడు, భగవంతుడైన శివుని నిందించటం చూసిన సతీదేవి అవమానభారంతో క్రుంగిపోయింది. ఎముకలను మెడలో వేసుకొని, పుఱ్ఱెను చేతిలో పట్టుకొని, శ్మశానంలో తిరిగేవాడు ఆమెకు భర్త అని తూలనాడాడు దక్షుడు. లోకాలను రక్షించటం కోసం, కాలకూట విషాన్ని తన కంఠంలో దాచుకొన్న పరమ కారుణ్యమూర్తిని యీ విధంగా నిదించటం తగదని హితవాక్యాలు పలికింది సతీదేవి. మూర్ఖత్వంతో పెచ్చురేగిపోతున్న దక్షుడిని ఆపలేక, అవమానభారంతో భర్త కంటపడలేనని నిశ్చయించుకొన్న సతీదేవి, తన శరీరాన్ని అగ్నికి ఆహుతి చేద్దామనుకొన్నది. ఆమె పొందిన అవమానాన్ని, దుఃఖాన్ని యీ పద్యంలో కూడా చూడవచ్చు.
" వృషభధ్వజుడు, భగవంతుడు, లయకారకుడైన శివుడు ఎప్పుడన్నా ఆదరంతో కావచ్చు, పరిహాసానికి కావచ్చు, ' దక్షతనయ ' అని పిలిస్తే, నేను ఇక్కడ పొందిన అవమానం గుర్తుకు వచ్చి పుర పుర మని దుఃఖంతో కుమిలిపోయి, ఆ చమత్కారపు మాటలను చిరునవ్వుతో తప్పించుకుంటాను. నిజానికి, నీ కూతురు నని చెప్పుకోవటం కంటె చావటం మేలు. "
శ్రీమదాంధ్ర మహాభాగవతము, చతుర్థ స్కంధము లోని యీ పద్యంలో, లోకవ్యవహారం కూడా దాగి ఉంది. భర్తను పుట్టింటివాళ్ళు నవ్వులాటకు ఒక మాటన్నా కూడా తట్టూకోలేని స్వాభిమానం కలది భరతభూమిలో పుట్టిన స్త్రీ. భారతనారికి పురాణాల లోని స్త్రీమూర్తులైన సతీదేవి, అనసూయ, సావిత్రి వంటి పతివ్రతలు ఆదర్శాలు. ఆ పరమ పాతివ్రత్య ధర్మాన్నే యీ పద్యం ప్రతిబింబిస్తున్నది.
ఈ పద్యం పోతన ఆంధ్రీకరించిన మహాభాగవతము, చతుర్థ స్కంధంలో ఉంది.
No comments:
Post a Comment