ఒక పువ్వందలి తేనెఁ ద్రావి మధుపా ! యుత్సాహివై నీవు వే
ఱొకటిం బొందెడి భంగి మ మ్మధరపియ్యూషంబునం దేల్చి మా
యకలంకోజ్జ్వల యౌవనంబు గొని అన్యాసక్తుఁ డయ్యెన్ విభుం
డకటా! యాతని కెట్లు దక్కె సిరి? మిథ్యాకీర్తి యయ్యెం జుమీ !
శ్రీమదాంధ్ర మహాభాగవతము, దశమ స్కంధము లోని ' భ్రమరగీతలు ' ఒక మహోజ్జ్వల అమలిన శృంగార ఘట్టం.
శ్రీకృష్ణునికీ నందవ్రజ గోపికలకు మధ్య నున్న మధురభక్తికి ఈ భ్రమరగీతలు పరాకాష్ఠ.
శ్రీకృష్ణుడు చెప్పిన విధంగా, గోపికల యోగక్షేమాలు విచారించటానికి వచ్చిన అతని అనుంగు చెలికాడు ఉద్ధవుణ్ణి ఉద్దేశించి, అన్యాపదేశంగా తుమ్మెదకు ఒక్కొక్క గోపిక ఒక్కొక్క రీతిలో తన విరహవేదనను విన్నవించుకొంటున్నది. అందులో, ఒక గోపిక ఇలా అంటున్నది.
" మధుపానం చేసి మత్తెక్కిన ఓ తుమ్మెదా! నువ్వు కనుక ఒక పువ్వు లోని తేనెను త్రాగి, దానిని విడిచిపెట్టి మరొకవైపు పువ్వు మీద వ్రాలినట్లు, శ్రీకృష్ణుడు తన అధరామృతాన్ని త్రాగనిచ్చి, మా ఉజ్జ్వలమైన యౌవనాన్ని దొంగిలించాడు. ఆ తరువాత అన్యకాంతల మీద మరులుగొంటున్నాడు. ఇటువంటి చంచలచిత్తుడికి శ్రీమహాలక్ష్మి ఎట్లా కైవసమయ్యిందో కదా! అతడు మంచివాడన్న పేరు బూటకమే కదా ! "
ఇందులో, గోపికల అమాయకహృదయం, ఎనలేని భక్తిభావం ద్యోతకమౌతున్నాయి. ఈ పద్యభావం ఆధారంగా దేవులపల్లి కృష్ణశాస్త్రిగారు " కృష్ణపక్షం " కావ్యం లోని ' తేటివలపు ' అనే ఖండికలో, తుమ్మెద చేత ఇలా పలికించారు.
" తేనెలం గూర్చి వలపుల దేటపరచి
ధన్యురాలయ్యె మీ చెలి తలిరుబోణి !
కాని నిరతంబు మల్లిక కడనె యుండి
ముదము గూర్పగ మా కొక్క పూవె చెపుమ ! "
నిజమే. విభుడు సర్వజీవుల హృదయపుష్పాల్లో ఉండేవాడు. మరి అలాంటి తేటివలపుకాడు ఒక్క పువ్వు దగ్గరే పొద్దుపుచ్చాలంటే అది దురాశ గదా !
No comments:
Post a Comment