ఎండకు వానకోర్చి, తనయిల్లు ప్రవాసపుఁ జోటు నాక, యా
కొండు, నలంగుదున్, నిదురకుం దఱి దప్పెడు, డప్పి పుట్టె, నొ
క్కొండన యెట్లొకో యనక కార్యము ముట్టినచోట నేలినా
తం డొక చాయ చూపినను దత్పరితం బని సేయు టొప్పగున్.
అజ్ఞాతవాసం పూర్తిచేయడానికి విరాటరాజు కొలువుకు వెళ్తున్న పాండవులకు అక్కడ ఎలా మసలుకోవాలో చెబుతున్నాడు ధౌమ్యుడు.
" ఎండకూ, వానకూ ఓర్చుకోవాలి. ఇది తనయిల్లు కావున సదుపాయంగా ఉంటుంది, పరుల ఇంట్లో ఇబ్బందిగా ఉంటుంది అనుకోకూడదు. ఆకలవుతున్నది, అలసిపోయాను, నిద్రకు వేళయింది, దాహం వేస్తున్నది, ఒక్కడినే ఎట్లా చెయ్యాలి? అనే మాటలకు అవకాశం ఎప్పుడూ ఇవ్వకూడదు. అత్యవసరంగా రాజుగారు ఒక పని చెప్పినప్పుడు, దానిని శ్రద్ధతో, భక్తితో చెయ్యాలి. "
ఏ పని చెయ్యడానికైనా, శ్రద్ధాభక్తులు చాలా అవసరం. పూర్వం, రాచరిక వ్యవస్థలు కాబట్టి, సేవకుడు ఏ మాత్రం అలసత్వం వహించినా, రాజదండన అంత కఠినంగానూ ఉండేది. ఇప్పటి ప్రజాస్వామ్య వ్యవస్థలో కూడా, పని సానుకూల మవ్వాలంటే, కష్టనష్టాలకు, స్థలం మార్పునకు, తట్టుకొనే ఓర్పు, నేర్పు ఉండాలి. ఇక పని మీద శ్రద్ధాభక్తులు ఎప్పుడైనా, ఎవరికైనా అవసరం.
కాలం మారినా కొన్ని ధర్మాలు మారవనే సత్యం, శ్రీమదాంధ్ర మహాభారతము, విరాటపర్వం, ప్రథమాశ్వాసంలోని ఈ పద్యం తేటతెల్లం చేస్తున్నది.
No comments:
Post a Comment