విను మొకమాట రాత్రిచర, వేగిర మేటికి? నిన్ జయింతురే
యనిమిషులైన? భాజనగతాన్నమ నేనిఁక నెందుఁ బోయెదన్?
బెనఁగక ప్రాణరక్షణ ముపేక్ష యొనర్చుట పాప, మిందుకై
కనలకు, నాకు మేనియెడఁ గాంక్షయు లేదిది వోవుటే యురున్.
శ్రీకృష్ణదేవరాయలచే రచింపబడిన మహా ప్రబంధము ఆముక్తమాల్యద. అందులో, షష్ఠాశ్వాసంలో మాలదాసరి కథ చెప్పారు రాయలవారు. ఆ కథ వరాహపురాణంలో ఉంది.
మాలదాసరి ప్రతిరోజు వేకువజామున లేచి, తన ఊరికి మూడు క్రోసుల దూరంలో ఉన్న వైష్ణవాలయం ముందు మంగళకైశికి గానం చేస్తాడు. ఒకరోజు, అర్థరాత్రి సమయంలో, తెల్లవారిందనే భ్రమతో, గుడికి బయలుదేరి, దారితప్పి ఒక అడవిలో ప్రవేశించాడు. ఆ కీకారణ్యంలో పెద్ద మఱ్ఱిచెట్టు ఉంది. ఆ మఱ్ఱిచెట్టు పైన ఒక బ్రహ్మరాక్షసు డున్నాడు. వాడు దాసరిని చూడగానే, చెట్టుమీద నుండి దాసరి మీదకు దూకి అతనితో తలపడ్డాడు. దాసరి కూడా శక్తినంతా కూడదీసుకొని అతనితో పోరాడాడు. కొంతసేపటికి, రాక్షసుడి నుండి తప్పించుకోవటం కష్టమని దాసరికి తెలిసింది. ఎప్పుడెప్పుడు తనను చంపి తిందామా అని కాసుకొని ఉన్న రాక్షసుడితో దాసరి అంటున్నాడు:
" ఓయి రాక్షసుడా! తొందర పడకుండా నేను చెప్పే మాటొకటి విను. నిన్ను గెలవటం దేవతలకైనా సాధ్యం కాదు. ఇక నా సంగతంటావా? నేను పళ్ళెంలో పెట్టిన అన్నాన్ని. ఎక్కడికి పోతాను? మరి నీతో ఎందుకు పోట్లాడానంటావేమో? ప్రాణరక్షణ విషయంలో అశ్రద్ధ చేయటం పాపమని నీతో పోట్లాడాను కానీ, నిన్ను ఓడిస్తానని మాత్రం కాదు. ఇంకో మాట విను. నాకు యీ శరీరం మీద మమకారం లేదు. ఇది పోవటమే మంచిది. "
దాసరి తక్కువ కులానికి చెందినవాడు. కానీ, అతని మానసిక పరిపక్వత చాలా ఎక్కువ స్థాయిలో ఉంది. అతడికి పాపపుణ్య వివేచన తెలుసు. " ప్రాణరక్షణ ముపేక్ష యొనర్చుట పాప " మన్న శాస్త్ర విషయాన్ని బ్రహ్మరాక్షసుడి దగ్గర చెప్పటం చూస్తే, దాసరి పెద్దల నుండి పాపపుణ్యములను గురించి తెలుసుకొని ఉంటాడని అనుకొనవచ్చు. శరీరం అనిత్యమని, అది పోవటమే మంచిదని, అనటం వల్ల, అతడు చదువుకొనకుండానే ఉపనిషత్సారాన్ని వంటబట్టించుకొన్నాడని, అటువంటి పరిపూర్ణ జ్ఞానంతో పండిపోయాడని అర్థమౌతున్నది.
No comments:
Post a Comment