భవదీయాత్మజు నాత్మజుండు కురుభూభారోద్వహుండయ్యె యా
దవవంశోత్తరుఁడైన వజ్రునకు నింద్రప్రస్థ రాజ్యంబు గౌ
రవ దీప్తంబుగ నిచ్చినాఁడ సుచరిత్రా ! రక్షణీయంబులై యీ
యిండులు రెండు నీవు దృఢధైర్యం బొప్ప రక్షింపుమా !
వ్యాసమహర్షి సూచన మేరకు ధర్మరాజు, తన తమ్ములు, ద్రౌపదితో పాటు, మహాప్రస్థానం చెయ్యడానికి నిశ్చయించాడు. అభిమన్యుడి కుమారుడు, పరీక్షిత్తును కురురాజ్య పట్టాభిషిక్తుడిని చేశాడు. అతడికి ధర్మయుతంగా ఎట్లా పరిపాలన చేయాలో చెప్పాడు. ఆ తరువాత ఉదాత్తచరిత్ర కలిగిన సుభద్రతో ఇలా అన్నాడు.
" అమ్మా సుభద్రా ! నేను నీ మనుమడైన పరీక్షిత్తుకు కురురాజ్య భారాన్ని అప్పగించాను. యాదవవంశ్రేష్ఠుడైన వజ్రుడికి ఇంద్రప్రస్థాన్ని ఏలుకొమ్మని ఇచ్చాను. ఈ కురు, యాదవ రాజ్యాలు రెండింటినీ, నీవు దృఢత్వంతో, ధైర్యంతో పరిరక్షించు. "
తిరుమల తిరుపతి దెవస్థానంవారు ప్రచురించిన మహాప్రస్థానిక పర్వానికి డాక్టరు హెచ్.ఎస్. బ్రహ్మానందగారు వ్రాసిన విశేష వ్యాఖ్యను ఇప్పుడు పరిశీలిద్దాం.
" అరణ్యంలో పాండవులు ఇడుములు పడినప్పుడు కూడా సుభద్ర చాలా ధైర్యంతో అభిమన్యుడిని ధనుర్విద్యా నిపుణుడిగా తయారుచేసింది. అటు మనుమడిది కౌరవ రాజ్యం. తన పుట్టింటి వంశం వాడైన వజ్రుడిది ఇంద్రప్రస్థం. అటూ ఇటూ ఇప్పుడు పెద్ద దిక్కు సుభద్రే. అందుకే ఆమెపై బాధ్యత పెట్టుతున్నాడు ధర్మరాజు. పాండవులు తమ తనువులు వదలిపెట్టటానికి సిద్ధపడుతున్నప్పుడు కూడా రాజ్యపాలనా బాధ్యతలను విస్మరించకపోవటం ఇక్కడ మనం స్మరించాలి. ' రాజధర్మం ' అంటే అదే.
ఈ పద్యం శ్రీమదాంధ్ర మహాభారతము, మహాప్రస్థానిక పర్వంలో ఉంది.
No comments:
Post a Comment