వెలువడి లీల నేగి మును వేడ్క నొనర్చిన మేటి చప్పరం
బుల నెలమిం మహార్ణవము పొంత వసించిన నుద్ధవుండు దా
నలఘుతపం బొనర్చుటకునై విపినOబున కేగువాడుగా
బలికిన దాని కొండొకడు వల్కడ కృష్ణుడు కాలవేదితన్.
పలుకక మ్రొక్కి వీడుకొలుపంగ వనంబున కప్పురోహితుం
డలఘు వినిశ్చయంబు వగ పంతయు మాన్పగ బోయె నాతనిన్
హలధరు డన్ప బోయి వినయంబున భక్తియు దోప నయ్యనా
కులు నటబుచ్చి యొక్కెడ నకుంఠితనిర్ణయ శాంతచిత్తుడై.
ధర్మరాజు పట్టాభిషేకం అయిన ముప్పయ్యారు సంవత్సరాలకు దేశంలో మహోత్పాతాలు మొదలయ్యాయి. మహాపతివ్రతయైన గాంధారి శాపం ఫలితంగా, మహాభారత యుద్ధానంతరం, సరిగా ముప్పయ్యారవ సంవత్సరంలో యాదవకుల వినాశనం, అందుకు తార్కాణంగా కృష్ణుని కొడుకు సాంబునికి ముసలం (రోకలి) పుట్టడం, వసుదేవుని ఆదేశం మేరకు దానిని పొడి చేసి సముద్రంలో కలపడం జరిగిపోయాయి. కాలవేదియైన కృష్ణుడు, ఈ పరిణామానికి ఏ మాత్రం కలత చెందక, ఈ సంఘటనకు ఏదైన పుణ్యస్థలం రంగభూమి అయితే మంచిదని, సముద్రతీరంలో జాతర ఏర్పాటు చేశాడు.
ద్వారక నుండి యాదవులు అమితోత్సాహంతో బయలుదేరి సముద్రతీరం చేరుకున్నారు. అక్కడ అంతకు ముందే ఏర్పాటుచేసిన చలువ పందిళ్ళ క్రింద కొలువుతీరారు. శ్రీకృష్ణుని చెలికాడు, మంత్రి, పురోహితుడు, మహాజ్ఞాని అయిన ఉద్ధవుడు తపస్సు చేసుకొనడానికి అడవికి వెళ్తానన్నాడు. భూతభవిష్యద్వర్తమానాలు తెలిసిన కృష్ణుడు మారు మాట్లాడలేదు.
" శ్రీకృష్ణుడు స్నేహితుడికి వీడ్కోలు చెప్పాడు. తాను తీసుకొన్న ధృఢసంకల్పంతో, ఉద్ధవుడి దుఃఖమంతా పటాపంచలయింది. ఉద్ధవుడు నిర్వికారుడై తపస్సుకు బయలుదేరాడు. ఉద్ధవుడిని దిగబెట్టి వస్తానని చెప్పి బలరాముడు, వినయభావంతో, అంతకు మించిన భక్తిభావంతో, ఉద్ధవునితో పాటు వెళ్ళి అతడిని అడవిలో దిగబెట్టి వచ్చాడు. తిరిగివచ్చిన బలరాముడు, నిర్వికారతతో, శాంతస్వభావుడై ( ఒంటరిగా ఒక చెట్టు క్రింద ధ్యానమగ్నుడై ఉన్నాడు.). "
శ్రీమదాంధ్ర మహాభారతము, మౌసలపర్వం లోని యీ రెండు పద్యాలు మానవ జీవిత పరమార్థాన్ని గుర్తుచేస్తాయి. ఒక లక్ష్యసిద్ధికై అవతారమెత్తిన శ్రీకృష్ణబలరాములకు కాలవశత తెలుసు. అందువల్లనే, యాదవకుల సంక్షయం తప్పదని తెలిసి, నిర్వికారంతో, శాంతమనస్కులై, సాక్షీభూతులై ఉన్నారు. చివరకు మిత్రుడు, హితుడు, మహాయోగి అయిన ఉద్ధవుడు తమకు దూరంగా వెళ్ళిపోతున్నా, ఉద్విగ్నతకు లోను కాకుండా అతనికి వీడ్కోలు పలికారు.
శ్రీకృష్ణుడు భగవద్గీత సాంఖ్యయోగం 56 వ శ్లోకంలో
" దుఃఖేష్వనుద్విగ్నమనాః సుఖేషువిగతస్పృహః
వీతరాగభయక్రోధః స్థితధీర్మునిరుచ్యతే. " అని ఉపదేశం చేశాడు.
ఏదైతే చెప్పారో అది ఆచరించి చూపిన స్థితప్రజ్ఞులు బలరామకృష్ణులు. సుఖదుఃఖాలకు అతీతమైన స్థితప్రజ్ఞత పొంది, ఉన్నంతలో జీవితాన్ని ఆనందమయ చేసుకోవాలన్నదే వారు మానవాళి కిచ్చిన దివ్యసందేశం.
కాలవేదులయిన ముగ్గురు మహాత్ముల అమనస్కయోగాన్ని పొదివిన యీ పద్యాలు శ్రీమదాంధ్ర మహాభారతము మౌసలపర్వంలో ఉన్నాయి.
No comments:
Post a Comment