జనవర బంధమోక్షణముఁ జైద్యవధంబును బాండురాజ నం
దను మఖరక్షణంబును నుదారతఁ జేసిన యట్టి దేవకీ
తనయుచరిత్ర భాసుర కథా పఠనాత్ములు గాంతు రిష్ట శో
భన బహుపుత్ర కీర్తులును భవ్యవివేకము విష్ణులోకమున్.
శిశుపాలుని వధ తరువాత, ధర్మరాజు నిర్విఘ్నంగా యజ్ఞ పరిసమాప్తి చేసి, అవభృథ స్నానం చేశాడు. ధర్మారాజు రాజసూయ యాగం చేసినందుకు ఒక్క సుయోధనుడు తప్ప అందరూ సంతోషించారు. అత్యంత మనోహరంగా మయుని చేత నిర్మింపబడిన సభలో భంగ పడిన ఆ కురురాజు అసూయాద్వేషాలతో కుమిలిపోయాడని మయసభ విశేషా లన్నింటినీ శుకమహర్షి పరీక్షిత్తుకు చెప్పాడు. చెప్పి, శ్రీ శుకుడు కృష్ణుని మహోదాత్త చరిత్రను యీ విధంగా ప్రస్తుతించాడు.
" ఓ పరీక్షిన్మహారాజా ! జరాసంధుని చెఱలో బందీలైన రాజులను విడిపించటం, చేది రాజు శిశుపాలుని వధించటం, పాండురాజు కుమారుడైన ధర్మరాజు యాగ పరిరక్షణ చేయటం వంటి దేవకీనందనుడైన శ్రీకృష్ణుని విజయగాథలను చదివినవారు, కోరుకొన్న సౌభాగ్యాన్ని, కీర్తిని, అఖండ జ్ఞానాన్ని, విష్ణుసాయుజ్యాన్ని పొందుతారు. "
భగవంతుని సాన్నిధ్యం కంటె దివ్యమైన, భవ్యమైన పదవి ఉండదు కదా ! పుత్రపౌత్రాభివృద్ధి, సంపదలు, యశస్సు ఇవన్నీ ముందు చెప్పి, అంతిమంగా కోరుకొనవలసిందీ, చేరుకొనవలసిందీ దివ్య వైకుంఠధామమే నని శుకమహర్షి చెప్పకనే చెప్పాడు.
ఈ పద్యం బమ్మెర పోతరాజు ఆంధ్రీకరించిన మహాభాగవతము, దశమ స్కంధంలో ఉంది.
No comments:
Post a Comment