పెల్లునఁ గూలు తజ్జలము పెక్కువ నొక్కట నమ్మహానలం
బెల్లను నాఱిపోవుఁ బృధివీశ్వర ! యేఱులు నబ్ధులున్ వెసం
దొల్లిటి యట్ల నిండుఁ బటుతోయదసంఘము లంతఁ బోక గ
ర్జిల్లుచు వెండియుం గురియుఁ చిత్రముగాఁగ ననేకకాలముల్.
ధారాపాతనితాంతవేగమున నిద్ధాత్రీతలం బాహతం
బై రూపేది మునుంగుఁ దోయములలో నత్యంతగంభీరవాః
పూరం బంతయు ముంచి మించుటయు దిగ్భూమీనభోభాగముల్
వే రూపింపఁగ రాకయుండఁ దమముల్ వేష్టించుఁ ద్రైలోక్యమున్.
మార్కండేయుడు చిరంజీవిగా ఎన్నో ప్రళయకాలాలు చూసాడు. ధర్మరాజు అడిగిన మీదట, ప్రళయకాల ప్రకృతి మహోత్పాతాన్ని వర్ణించి చెబుతున్నాడు.
" ఓ ధర్మరాజా ! ప్రళయకాలంలో ఎడతెరిపి లేకుండా కురిసిన వాననీటి చేత, ఆ మహాగ్ని అంతా ఆరిపోతుంది. ఏరులు, వాగులు, వంకలు, నదులు, సముద్రాలు - అన్నీ ఎప్పటిలాగానే నీటితో నిండిపోతాయి. ఆకాశంలోని ప్రళయకాల మేఘాలు గర్జిస్తూ చాలా కాలం వర్షాన్ని కురిపిస్తూనే ఉంటాయి. ఆ విధంగా ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వాననీటిచేత భూభాగమంతా బాగా కొట్టబడి ఆకృతి మారిపోయి నీటిలో మునిగిపోతుంది. అట్లా, మొత్తం నీటితో ముంచివేయబడటం వల్ల, ఇవి దిక్కులు, ఇది, భూమి, ఇది ఆకాశం అని తెలియకుండాపోతుంది. అన్నివైపులా పెనుచీకట్లు ముల్లోకాలను ఆవరిస్తాయి. "
సముద్రంలో ఉప్పెన చెలరేగినప్పుడు ప్రకృతి చేసే విలయతాండవాన్ని అనేకరెట్లు ఉహించుకుంటే ప్రళయకాల మహోత్పాతాన్ని కొంచెం అర్థం చేసుకోవచ్చు.
ప్రబంధపరమేశ్వరుడు ఎఱ్ఱన రచించిన యీ పద్యాలు శ్రీమదాంధ్ర మహాభారతము, అరణ్యపర్వం, చతుర్థాశ్వాసం లోనివి.
No comments:
Post a Comment