పుట్టం బుట్ట, శరంబునన్ మొలవ, నంభోయానపాత్రంబునన్
నెట్టం గల్గను గాళిఁ గొల్వను బురాణింపన్ దొరంకొంటి మీఁ
దెట్టే వెంటఁ జరింతుఁ దత్సరణి నా కీవమ్మ యో ! యమ్మ మేల్
పట్టున్ నా కగుమమ్మ నమ్మితిఁ జుమీ ! బ్రాహ్మీ దయాంభోనిధీ !
శ్రీమదాంధ్ర మహాభాగవతము ప్రథమ స్కంధము లోని యీ పద్యం ఇష్టదేవతా ప్రార్థనకు సంబంధించినది.
సంసృతంలో వ్రాయబడిన భాగవత పురాణాన్ని ఆంధ్రీకరించడానికి పూనుకొన్న బమ్మెర పోతనామాత్యుడు సరస్వతీదేవిని స్తుతిస్తూ, ప్రాచీన సంస్కృత మహాకవులను స్మరించడం విశేషం.
ఇప్పుడు, పోతన చదువుల తల్లిని స్తుతించిన తీరు చూద్దాం.
" బ్రహ్మదేవుని అర్థాంగివైన ఓ సరస్వతీ ! నేను పూర్వ సంస్కృత కవులైన వాల్మీకి వలె పుట్టలో పుట్టినవాడిని కాదు, శరము అన్న శబ్దానికి అర్థమైన బాణము పేరుపెట్టుకొన్న బాణుడిని కాదు, పడవలో పుట్టిన వ్యాసుడిని కాదు, కాళీమాత వరప్రసాదం కలిగిన కాళిదాసుని కాదు. అయినా, మహాభాగవత పురాణాన్ని తెనుగు చేయడానికి పూనుకొన్నాను. అందువలన, వారు పోయిన మార్గాన్నే పోయేటట్టు చేసి, గంభీరమైన కవితాసరణిని నాకు ఇవ్వు. నిన్నే నమ్ముకున్న నాకు వెన్నుదన్నుగా ఉండు తల్లీ ! "
బ్రాహ్మి అంటే బ్రహ్మదేవుని భార్య. పుట్టలో పుట్టిన వాల్మీకి ఆదికవి, సంస్కృత రామాయణం వ్రాసిన వాడు. శరము అన్న శబ్దానికి సమానార్థకమైన పేరుపెట్టుకున్నవాడు గద్యరచనలో మేటి, కాదంబరి కావ్య నిర్మాత బాణుడు. పడవలో పుట్టినవాడు, మహాభాగవత పురాణాన్ని రచించిన, పరాశరుని కుమారుడు వ్యాసుడు. కాళికాదేవి అనుగ్రహంతో మహాకవియై, రఘువంశం, కుమార సంభవం, మేఘసందేశం వంటి మహాకావ్యాలను, అభిజ్ఞాన శాకుంతలం వంటి విశ్వవిఖ్యాతి గాంచిన నాటకాన్ని వ్రాసినవాడు కాళిదాసు.
ఒకవైపు చదువుల తల్లి ప్రార్థన, మరొకవైపు ప్రాచీన సంస్కృత మహాకవుల స్మరణతో, ఈ పద్యం ఎంతో ప్రసిద్ధి వహించింది.
No comments:
Post a Comment