నలువుగఁ బైడికఱ్ఱుగల నాఁగలి వెండిది పూని సన్న మి
న్నుల నువుచేను దున్నుకొనునో నును వెన్నెలకాఁపునాగ, ము
క్కలుగను నేలగడ్డ విఱుగన్ దెలిమన్ను వెలారినట్లు మ
బ్బులపొర లొప్పఁగా గగనభూమిని హంస చరింపనయ్యెడన్.
మునుకొని యాకసంబనెడి బూడిదగుమ్మడిపాదు దిక్కులం
దునఁ గొనసాగి పూ వదలెనో పువురేక తుదళ్ళఁ దేంట్లు నె
ఱ్ఱని మధువల్ల ఱెక్కలను బ్రామడ వ్రాలి చరించుచుండగా
ననఁగను హంస మింటనడయాడగ దైత్యమహేంద్రుఁ డుగ్రతన్.
శ్రీమద్రామాయణ కల్పవృక్షము, యుద్ధ కాండము , సంశయ ఖండంలో " హంస దౌత్యం " ఘట్టం విశ్వనాథోపజ్ఞకం. ఆకాశాన విహరిస్తున్న హంసను విశ్వనాథ ప్రబంథరీతిలో తనివితీరా వర్ణించారు.
" ఆకాశంలో హంస విహరిస్తూ ఉంటే, చక్కగా అమర్చిన బంగారపు కఱ్ఱు గల వెండి నాగలితో, సన్నని వెన్నెల కాంతిలో, ఆకాశమనే నువ్వుచేనును దున్నుతున్నట్లుగా ఉంది. ఇక ఆకాశంలోని మబ్బుపొరలు, సన్నని వెన్నెలలో, ఆ దున్నిన నేల ముక్కలు ముక్కలుగా విరిగి, తెల్లని మట్టిని పైకి లేపుతున్నట్లుగా, కనబడుతున్నాయి.
ఆకాశమనే బుడిదగుమ్మడిపాదు అన్ని దిక్కులకు పాకి, పువ్వులను వదిలిందా అన్నట్లు, ఆ పూరేకల చివరలో తుమ్మెద, ఎర్రని తేనె అంటుకొన్న రెక్కలతో వాలి తిరుగుతున్నదా అన్నట్లు, హంస ఆకాశంలో విహరిస్తూ ఉంది. రావణుడు కోపంగా దాని వంక చూసాడు. "
అవతారికలో, విశ్వనాథ పదిమంది ప్రాచీనాంధ్ర మహాకవులను గురుస్థానంలో ఉంచారు. వారిలో, పెద్దన, కృష్ణదేవరాయల వంటి ప్రబంధకవు లున్నారు. వారి మార్గంలో, స్వీయప్రతిభను జోడించి, సందర్భోచితంగా, ప్రబంథ రీతిలో హంసదౌత్యములో విశ్వనాథ హంసను అత్యద్భుతంగా వర్ణించారు.
No comments:
Post a Comment