చక్కనివారల చక్కఁదనంబున
కుపమింప నెవ్వండు యోగ్యుడయ్యె !
మిక్కిలి తపమున మెఱయు నంబికకు నై
శంకరు నెవ్వండు సగము సేసె
బ్రహ్మత్వమును బొంది పరగు విధాతను
వాణికై యెవ్వడు వావి సెఱిచె !
వేయిడాగులతోడి విబుధ లోకేశుని
మూర్తికి నెవ్వడు మూలమయ్యె !
మునుల తాలిమి కెవ్వడు ముల్లుసూపు
మగల మగువల నెవ్వండు మరులు కొలుపు !
గుసుమధనువున నెవ్వండు గొను విజయము
చిగురువాలున నెవ్వండు సిక్కువఱుచు?
శివుని కంటి మంటలకు బూడిదైన మన్మథుడు ద్వాపరయుగంలో రుక్మిణీకృష్ణులకు ప్రద్యుమ్నుడిగా జన్మించాడు. ప్రద్యుమ్నుడు తనను చంపటానికి పుట్టినవాడని తెలిసిన శంబరాసురుడు పురిటింటి నుంచి బిడ్డను ఎత్తుకుపోయి సముద్రంలో పడవేసాడు. సముద్రంలోని ఒక పెద్ద చేప ఆ శిశువుని మ్రింగింది. చేపలు పట్టేవారి వలలో తక్కిన చేపలతో పాటు, ఈ పెద్ద చేప కూడా పడింది. ఆ పెద్ద చేపను వాళ్ళు శంబరుడికి కానుకగా ఇచ్చారు. వంటశాలలో, దానిని కోయగా, అందమైన బాలుడు బయటపడ్డాడు. శంబరుని వద్ద గౌరవప్రదమైన పనితో కాలం గడుపుతున్న రతీదేవికి యీ విషయం పరిచారికల ద్వారా తెలిసింది. నారదుడు, ఆ పిల్లవాడు రతీదేవి ఎదురుచూస్తున్న ఆమె పెనిమిటి మన్మథుడు అని చెప్పాడు. బాలుడిని పెంచుకుంటానని శంబరుడిని ఒప్పించి రతీదేవి ఆ పిల్లవాడిని తీసుకువెళ్ళింది.
శ్రీ శుకుడు చెబుతున్నాడు.
" ఓ పరీక్షిన్మహారాజా ! ఆ పిల్లవాడి అందం ఏమని చెప్పమంటావు? ఆ పిల్లవాడిని ఒక్కసారి చూసిన సుందరీమణులకి అతనితో కామసౌఖ్యాలు అనుభవించాలని కోరిక కలుగుతుంది.
ప్రద్యుమ్నుడు ఎటువంటి వాడంటే, అందమైనవారికి పోలికగా చెప్పాలంటే అతడినే చెప్పాలి. పార్వతిని ఇచ్చి పెళ్ళిచేయడం కోసం, యోగయోగీశ్వరుడైన పరమేశ్వరుని తపస్సు భగ్నం చేసి, ఆయనను అర్థనారీశ్వరుడిని చేశాడు. బ్రాహ్మ్యతేజంతో మెరిసిపోయే బ్రహ్మదేవుడిని, సరస్వతీదేవి కోసం వావివరసలు మరిచిపోయేలా చేశాడు. ఇక, ఇంద్రుడినైతే, అహల్య కోసం అర్రులు చాచేలా చేసి, ఆయన ఒళ్ళంతా కళ్ళయ్యేలా చేశాడు.
మునుల ఓర్పుకు ఎవడు ముల్లులాంటి వాడో, స్త్రీపురుషు లొకరిపై నొకరికి ఎవడు మోహాగ్నిని రగులుస్తాడో, పుష్పబాణంతో ఈ సమస్త విశ్వాన్ని ఎవడు జయించగలుగుతాడో, చిగురుటాకు అనే కత్తితో ఎవడు చీకాకు పరుస్తాడో, వాడే యీ మన్మథుని మారు రూపైన ప్రద్యుమ్నుడు. "
వడ్డాది పాపయ్యగారి వంటి వారు గీసిన రంగుల బొమ్మలు నయనానందకరమైతే, , పోతనగారి యీ భావజుని (మన్మథుని) అక్షర చిత్రం మనోరంజక మవుతుందనటంలో అసమంజస మేమీ లేదు.
ప్రద్యుమ్న జననాన్ని గురించి చెప్పిన ఈ సీసపద్యం, శ్రీమదాంధ్ర మహాభాగవతము, దశమస్కంధంలో ఉంది.
No comments:
Post a Comment