చెఱువు నొడ్డున విశ్రమించెదమ కాదె
యనిన జానకి, శ్రీరాముఁడనె నయోధ్య
వదిలి విశ్రాంతి కొఱకయి వచ్చినావె,
యనిన జానకి యటఁగలదా యటంచు.
అవున యయోధ్యలోఁ దెఱపి యంతని యింతని చెప్పనా ! ధరా
ధవుడు స్నుషైకజీవి చనె దైవతలోకము, బిడ్డయైన రా
ఘవుని వనంబుపోక కథ కట్టి నిరంతము స్రుక్కుతల్లి, య
న్న వదలినట్టి చెప్పులయినన్ బినతమ్ముఁడు కొల్వఁ డప్పురిన్.
సీతను వెంటబెట్టుకొని, రామలక్ష్మణులు అరణ్యప్రాంతంలో నడిచి వెళ్తున్నారు. సీత బాగా అలసిపోయింది. ఇంతలో వారికి జలసమృద్ధితో కళకళలాడుతున్న ఒక చెరువు కనిపించింది. ఆ చెరువు గట్టున కాసేపు విశ్రాంతి తీసుకుందామన్నది సీత. హాస్యాద్భుతశీలి అయిన శ్రీరాముడు, " అయోధ్య నుంచి ఇంతదూరం వచ్చింది విశ్రాంతి తీసుకోవడానికా? " అన్నాడు. సీతమ్మ ఏమన్నా తక్కువ తిన్నదా, అడగాల్సిన నాలుగూ అడిగి, కడిగిపారేసింది.
" అబ్బ ! అయోధ్యలో అంతా ఇంతా తీరికని చెప్పాలా? అందుకేనేమోలే, చక్కగా కోడలు పరిచర్యలు చేస్తుంటే విశ్రాంతి తీసుకోవాల్సిన మహారాజు పరలోకగతు డయ్యాడు. ఇక బిడ్డ రాఘవుని వనవాసం కథ తల్చుకొని ప్రతిరోజూ దుఃఖించే తల్లి సంగతి వేరే చెప్పాలా? అమ్మో , అన్నగారు వదిలిన చెప్పులను పెట్టుకొని, తమ్ముడు భరతుడు నందిగ్రామంలో పూజ చేస్తున్నాడు కానీ, అయోధ్యలో మాత్రం ఉండటం లేదు. అయోధ్యలో విశ్రాంతికి కొదువా? " అన్నది.
శ్రీమద్రామాయణ కల్పవృక్షము, అరణ్య కాండము, దశవర్ష ఖండము లోని యీ పద్యాలు దంపతుల మధ్య జీవనవ్యవహారంలో మొలకెత్తే చిరుతగాదాలకు, ప్రణయకలహాలకు, ఒక చక్కని, హాస్యరసపూరితమైన ఉదాహరణగా చెప్పుకోవచ్చు.
No comments:
Post a Comment