ధరణిని వేయిమంది వసుధావరు లుందురు గాక ధర్మ సం
భరణము చేయు భూపతికిఁ బాల్యుల మే మటుగాన నీవు మా
నరపతి వౌదు వేల్పులయినం బలుకోట్లు గదా ! తపస్సులన్
హరిహయుఁ డొండె ధర్మభృతి నందును నాఱవపాలు రాఘవా!
శమదమాధ్యయనాగ్నిహోత్రము తపము
దానమును సత్యమనునవి ధర్మమగును
నీవు ధర్మము పాలింతు నీరజాక్ష !
పొదివికొని ధర్మ మాచరించెదము మేము.
కోపం బెక్కిన నెత్రునాడు లవి మాకున్ లేవ యిమ్మేనులం
దీ పాణిద్వయ మర్చనావిషయమై యెట్లో రిపుధ్వంసన
వ్యాపారంబున నట్లు సాగవు తపస్యన్ ధర్మపాలుండ వీ
వై పాలింపక యున్నచో శరణు లేదయ్యా ! రఘూత్తంసమా !
శ్రీరాముడు అరణ్యవాసానికి వచ్చాడు. చుట్టుప్రక్కల ఆశ్రమాల్లో ఉన్న మునులందరూ రాముణ్ణి చూడటానికి వచ్చారు. వారు రామునితో తమ గోడు వెళ్ళబోసుకుంటున్నారు.
" భూమ్మీద ఎంతోమంది రాజులు రాజ్యం చేస్తూ ఉండవచ్చు. అందులో ధర్మయుతంగా పరిపాలన చేసేవారు కొందరే. ధర్మయుతంగా పరిపాలన చేసే రాజు పరిపాలనలో ఉండాలని కోరుకొనే వాళ్ళం మేము. అందుచేత, నీవు మాకు ప్రభువువి. ఉండటానికి కోట్లకొలది దేవతలున్నారు. అందులో, ధర్మశాస్త్రం ప్రకారం ఆరవ వంతు హవిస్సుగా గ్రహించేది ఇంద్రు డొక్కడే కదా !
శమదమాదులు, వేదాధ్యయనం, అగ్నిహోత్రం, తపస్సు, దానం, సత్యం అనేవి ధర్మ మార్గాలు, ధర్మాన్ని పరిరక్షించేవి. నీవు ధర్మ పాలన చేసేవాడివి, ఆ నీడలో ధర్మాన్ని ఆచరించే వాళ్ళం మేము.
రఘువంశతిలకుడవైన ఓ రామా ! నెత్తురుడికించే కోపమనేది మా దేహనాడుల్లో లేవు. మా చేతులు దేవతార్చనకు, తపస్సుకు ఎట్లా ఉపకరిస్తాయో, ఆ విధంగా శత్రు సంహారానికి పనిచెయ్యవు. నీవే పూనుకొని, మా యజ్ఞయాగాదులను, తపస్సులను కాపాడకపోతే, మాకిక వేరొక గతి లేదు. "
శ్రీరాముని అవతార లక్ష్యాలలో రావణ సంహారం ప్రధానమైనదైతే, దానికి వెనుక దాగియున్న మూలసూత్రం ధర్మ పరిరక్షణే కదా ! దండకారణ్యంలో యజ్ఞయాగాదులను, మునుల తపస్సులను భగ్నం చేస్తున్న రాక్షస సంహారం కూడ రామావతార లక్ష్యాలలో ఒకానొకటి. ధర్మప్రభువు ఏలుబడిలో ఉన్నవారిగా ఆ విధిని గుర్తుచేస్తున్నారు మునులు.
ఈ పద్యాలు, శ్రీమద్రామాయణ కల్పవృక్షము, అరణ్య కాండము, దశవర్ష ఖండము లోనివి.
No comments:
Post a Comment