తల్లియుఁ దండ్రియున్ గురుడు దైవము నా కరయంగ నీవ భూ
వల్లభ ! నీవు కానన నివాసము గోరి చనంగ నెట్టు లే
నుల్లము వట్టి హస్తిపురి నుండఁగ నేర్తు? యుయుత్సుఁ బెంపు శో
భిల్లఁగ రాజుఁ జేయు, నినుఁ బ్రీతి యెలర్పఁగఁ గొల్చి వచ్చెదన్.
కొడుకు లందరినీ కోల్పోయిన దుఃఖంతో ఉన్న గాంధారీధృతరాష్ట్రులను తలిదండ్రులలాగా, కురువంశానికి పెద్దదిక్కు లాగా, ధర్మరాజు ఎంతో గౌరవిస్తూ, వారికి కావలసిన సదుపాయాలన్నీ సమకూరుస్తూ, పదిహేనేళ్ళు జాగ్రత్తగా మెలుగుతూ వచ్చాడు. ఒకరోజు, ధృతరాష్ట్రుడు , గాంధారీసహితంగా, వానప్రస్థానికి అడవికి వెళ్ళటానికి ధర్మరాజు అనుమతి కోరాడు. ధృతరాష్ట్రుని మాటల్లోని ఆంతర్యాన్ని గ్రహించిన ధర్మరాజు, పెదతండ్రితో ఇలా అంటున్నాడు.
" ఓ ధృతరాష్ట్ర మహారాజా ! నాకు, తల్లీ, తండ్రి, గురువు, దైవం, అన్నీ నీవే. నీవు కావాలని అరణ్యవాసాన్ని కోరి వెళతానంటే, నే నెట్లా రాజధాని హస్తినాపురంలో ఉండగలను? అందుకని, గౌరవం ఇనుమడించే విధంగా యుయుత్సుడిని రాజుని చేయ్యి. అప్పుడు నీకు సంతోషం కల్గేటట్లుగా నేను నీతో అడవికి వస్తాను. "
ధర్మరాజు మాటలు లోతుకు వెళ్ళి ఆలోచిస్తే గాని పట్టుబడవు. ధృతరాష్ట్రుడిని ' భూవల్లభ ! ' అని సంబోధించటంలోనే, ధర్మరాజు చమత్కారమంతా ఉంది. రాజ్యం వీరభోజ్యం. పాండవులకు ధృతరాష్ట్రుడు రాజ్య మివ్వలేదు. క్షత్రియధర్మంగా వారు సంపాదించుకొన్నారు. అయినప్పటికీ, ధృతరాష్ట్రుడినే రాజుగా భావించి సమస్త సౌఖ్యాలు సమకూరుస్తున్నప్పటికీ, అతడు కావాలనే అడవులకు వెళ్తానంటున్నాడు. ధృతరాష్ట్రుడు, "'పాండవులు రాజ్యం చేస్తుంటే చూడలేకుండా ఉన్నాడు " అన్న వ్యంగ్యం, ధర్మరాజు వాడిన " పెంపు శోభిల్లగ " అన్న మాటల్లో ఉంది. అందుకనే, ధృతరాష్ట్రపుత్రుడు యుయుత్సుడిని రాజుని చెయ్యమంటున్నాడు.
యుయుత్సుడు ధృతరాష్ట్రుడికి వైశ్యస్త్రీ ద్వారా పుట్టినవాడు. క్షత్రియుడు కాదు. రాజ్యం ధర్మరాజుది. అయినప్పటికీ, యుయుత్సుడిని రాజుని చెయ్యమనటం వల్ల, " అతడు రాజ్య మెట్లాగూ సంపాదించుకోలేడు, నువ్వే రాజుని చేసి, నీ కొడుకు రాజ్యం చేస్తున్నడన్న పెంపు (గౌరవం) పొందు " అన్న ఎత్తిపొడుపు ఉంది. " నిన్ బ్రీతి యెలర్పగ గొల్చి వచ్చెదన్ " అనటంలో " నేను రాజ్యం చెయ్యటం నువ్వు రోజూ ఏడుస్తూ చూడలేవు కాబట్టి, నీతో పాటే మేమూ అడవుల దారి పడితే నీకు సంతోషంగా ఉంటుందన్న " ధ్వని ఇందులో ఉంది.
సంజయుడు చెప్పినట్లు, ధర్మరాజు " మెత్తనిపులి " . అతని ఆంతర్యం అంత తొందరగా అర్థం కాదు.
ఈ పద్యం శ్రీమదాంధ్ర మహాభారతము, ఆశ్రమవాస పర్వం, ప్రథమాశ్వాసంలో ఉంది.
No comments:
Post a Comment