ఇభలోకేంద్రుఁడు హస్తరంధ్రముల నీరెక్కించి పూరించి చం
డభ మార్గంబున కెక్కి నిక్కి వడి నుడ్డాడించి పింజింప నా
రభటిన్ నీరములోనఁ బెల్లెగసి నక్రగ్రాహ పాఠీనముల్
నభమం దాడెడు మీన కర్కటములన్బట్టెన్ సురల్ మ్రాన్పడన్.
నక్రము = పీత
గ్రాహము. = మొసలి
పాఠీనము = చేప
త్రికూట పర్వత ప్రాంతంలో, ఏనుగులు గుంపులు గుంపులుగా తిరుగుతుండేవి. ఒకరోజు, ఒక ఏనుగుల మంద దారితప్పి వేరొక మార్గంలో వెళ్ళడం మొదలుపెట్టింది. వాటికి బాగా దప్పికయింది. నీరు త్రాగడానికి ఒక సరస్సులో దిగాయి.. సరస్సులోని చల్లని నీటితో దప్పిక తీర్చుకొని, తొండాల నిండా నీటిని పీల్చుకొని, ఒకదాని మీద ఒకటి చిమ్ముకోవటం మొదలుపెట్టాయి. అప్పుడు ఆ గుంపులోని గజరాజు సరస్సులో చేసిన క్రీడావిన్యాసమే యీ పద్యం యొక్క భావం.
" గజేంద్రుడు తొండం లోనికి నీటిని బాగా పీల్చుకొన్నాడు. తొండం ఆకాశం వైపుకి ఎత్తాడు. మెడ నిక్కించి, పుక్కిలించి, నీళ్ళను పైకి చిమ్మాడు. నీటిని పైకి ఎగజిమ్మినప్పుడు, ఆ వేగానికి, నీటిలో ఉన్న పీతలు, మొసళ్ళు, చేపలు, క్రమంగా ఆకాశంలో సంచరించే కర్కాటకరాశిని, మకరరాశిని, మీనరాశిని పట్టుకొన్నాయి. అది చూసి, దేవతలు ఆశ్చర్యపోయారు. "
గజేంద్రుడు ఎంత ఎత్తుకు నీటిని చిమ్మాడని చెప్పటానికి జ్యోతిష్యాన్ని ఆధారంగా చేసుకొని, పోతనగారు అద్భుతమైన కల్పన చేశారు. ఈ పద్యం శ్రీమదాంధ్ర మహాభాగవతము, అష్టమ స్కంధంలో ఉంది.
No comments:
Post a Comment