న జాయతే మ్రియతే వా కదాచిత్ నాయం భూత్వా భవితా వా న భూయః |
అజో నిత్యః శాశ్వతోయం పురాణో న హన్యతే హన్యమానే శరీరే. ||
కన నీ యాత్మకు జావుపుట్టుక లనంగా లేవు, పూర్వంబునం
దున లేకుండియు గ్రొత్తగా బొడమ డెందోయుండిలేకుండు వా
డుం గాడీతడు, చావుపుట్టుకలు రెండున్ లేని నిత్యుండుసూ
తను, దేహంబు నశించినన్ మరణమందం డెప్పుడున్ ఫల్గునా!
శ్రీకృష్ణ భగవానుడు అర్జునునకు ఆత్మ తత్త్వాన్ని గురించి చెబుతున్నాడు.
" అర్జునా ! ఆత్మ ఎప్పుడూ పుట్టటం లేదు. అలాగే చావటమూ లేదు. ఇది వరకు లేకుండా ఉన్నవాడు కాదు. ఇప్పుడు క్రొత్తగా వచ్చేవాడునూ కాదు. ఈ ఆత్మ జననమరణాలు లేనిది, శాశ్వతమైనది, పురాతనమైనది. శరీరము చంపబడినా, ఆత్మకు మాత్రం చావు లేదు. "
భగవద్గీత ప్రతి అధ్యాయం చివర, భగవానుడు " ఇది ఉపనిషత్తులచే ప్రతిపాదింపబడిన బ్రహ్మవిద్య, యోగవిద్య " అని చెప్పాడు. దానికి తార్కాణంగా, కఠోపనిషత్తులో యీ క్రింది శ్లోకం కనపడుతుంది.
" న జాయతే మ్రియతే వా విపశ్చిన్నాయం
కుతశ్చిన్న బభూవ కశ్చిత్
అజో నిత్యః శాశ్వతోయం పురాణో
న హన్యతే హన్యమానే శరీరే. "
దీనివలన, గీతాశాస్త్రం ఉపనిషత్తుల సారమని తెలుస్తున్నది.
ఆత్మ నిత్యత్త్వం తెలిసిన జ్ఞాని చావుపుట్టుకలను గురించి అనవసరంగా చింతించడు. ఆత్మకు పుట్టుక లేదు. అది నశించనిది. అదిఎల్లప్పుడు ఉండేది. కాలాతీతమయింది. అది, అనాది. ఎప్పటినుండో ఉన్నది. ఇక దేహి, దేనిని గురించి భయపడాలి? అశాశ్వతమైన శరీరం గురించా? ఇది అజ్ఞానం. ఇది అజ్ఞానం నుంచి పుట్టిన భయం. భయమనేది జంతులక్షణం. మానవజన్మ, జంతు జన్మలకు పైనున్న, ఉత్తమమైన జన్మ. అందువల్ల, మానవుడు, జంతు లక్షణాన్ని దాటి, నిర్భయత్వాన్ని వహించాలి. విముక్తుడవ్వాలి. అప్పుడే, మానవుడికి ఆత్మ తత్త్వం తెలుస్తుంది. ఇదే, ఈ శ్లోకం ద్వారా భగవానుడు మానవజాతి కిచ్చిన దివ్య సందేశం.
ఇది శ్రీమద్భగవద్గీత, సాంఖ్య యోగం లోని ఇరవయ్యో శ్లోకం.
No comments:
Post a Comment