మనము మరులుఁ తీగను త్రొ
క్కిన జాడగఁ గానిపించుఁ గేవల మిది త్రో
వన వీలు లేదు చెఱు వను
కొనునది కన్పించ దడవి కోనయె కాకన్.
నా రాముం డనె నెంతయున్ మరులుగొన్నంగాదటే ఘోరకాం
తారంబున్ బతితోడ వచ్చు టనినన్ ధాత్రీజ ధర్మంపు బు
ద్ధ్యా రానైనది భర్త పై మరులు లేదన్నన్ రఘూత్తంసకుం
డారంభించు శిరఃప్రకంపముగ ముందై యేగె మార్గంబునన్.
బొమముడి విస్ఫుటకోపా
భిమాన హృదయుఁడు రఘుప్రవీరుఁడు నడచెన్
శ్రమమునఁ గించిద్దుఃఖా
భిమానహృదయాబ్జ యేగెఁ బృధ్వీసుతయున్.
శ్రీమద్రామాయణ కల్పవృక్షము నందలి చిన్న కథలలో " విరాథుని వృత్తాంతము " ఒక అద్భుతమైన, చిత్రమైన కథ. దానిని, తక్కిన రామాయణ కవులకు భిన్నంగా, విశ్వనాథవారు తీర్చిదిద్దిన విధానం, ప్రతిభాశాలియైన భాష్యకారుని తీర్పు లాగా ఉంది.. ఎందువల్లననగా, మూల రామాయణంలో చిక్కుముడిగా ఉన్న అంశాలను విడదీసి, వాటికి ఒక రూపాన్ని, హేతువును సంతరించిపెట్టారు విశ్వనాథ.
అరణ్యంలో సీతారామలక్ష్మణులు ఒకరి వెనుక ఒకరు నడిచి వెళ్తుంటారు. లక్ష్మణుడు ముందు, అతని వెనుక సీత, ఆమెకు వెనుక రాముడు, అందరూ కొంచెం దూరంలో నడిచి వెళ్తూ ఉంటారు. అటువంటి సందర్భంలో, విరాధుడు, రామలక్ష్మణుల కంట పడకుండా, , సీతను ఏ విధంగా ఎత్తుకొని పారిపోసాగాడు అనేది ప్రశ్న. ఈ ప్రశ్నకు హేతుబద్ధమైన కారణాన్ని తమ రామాయణంలో చూపించారు విశ్వనాథ. విశ్వనాథోపజ్ఞకంగా, దంపతుల మధ్య హాస్యరసపూరకమైన ఒక సన్నివేశాన్ని కల్పించి, సీతారామలక్ష్మణులు అరణ్యమార్గంలో నడిచే పూర్వక్రమాన్ని మార్చి, విరాథుడు సీతను ఎత్తుకొని పారిపోయే సమయంలో, సీత వారికి కనిపించకుండా ఉండేటటువంటి ఇంకొక క్రమాన్ని తీసుకొచ్చారు. .
సీతారాముల మధ్య జరిగిన హాస్యరసభరిత సన్నివేశం, వారి మధ్య కించిత్ మనస్తాపాన్ని కలిగించి, వారిద్దరి మధ్య నడిచేటప్పుడు దూరం ఏర్పడటానికి పూర్వరంగంగా ఉపకరించేటట్లు చేశారు. తెచ్చిపెట్టుకున్న కోపంతో రాముడు, అభిమానంతో సీత, వారిద్దరూ ఎడమొగం పెడమొగంగా నిల్చొని ఉన్నారు. . " బొమముడి విస్ఫుట కోపాభిమానహృదయుడు " రాముడు . " శ్రమమునఁ గించిద్దుఃఖాభిమాన హృదయాబ్జ బృధ్విసుత " ఇక లక్ష్మణుడి సంగతి. ముళ్ళతో నిండి ఉన్న చెరువుగట్టును శుభ్రపరచి వచ్చిన లక్ష్మణుడు ఏమీ అర్థం గాక, చెరువులోకి దిగాడు. ఆ తరువాత, రాముడు రెండడుగులు ముందుకు వేస్తుంటే, కుంచించుకుపోయిన సీత రెండడుగులు వెనక్కన్నట్లు మెల్లగా నడుస్తున్నది. ఈ విధంగా, రామలక్ష్మణులకు తెలియకుండా విరాధుడు సీతను పట్టుకోగలగటానికి, విశ్వనాథ తన ప్రతిభతో, ఇంత చక్కని పూర్వరంగాన్ని, హేతువును కల్పించారు.
విశ్వనాథ ఒక భావుకుడు, మహాకవి, భాష్యకారుడు, ఋషి.
ఈ సన్నివేశం శ్రీమద్రామాయణ కల్పవృక్షము, అరణ్యకాండము, దశవర్ష ఖండములో ఉంది.
No comments:
Post a Comment