తన జనిహేతువై చనిన దైత్యగుణంబది పొంగి రామచం
ద్రుని యభిషేకమంచని యెఱుంగకయే సహజక్రుధామతిన్
జని, పరిచారికాసమితి సంగతి కన్గొని కర్ణవీథిఁ దా
కిన యభిషేకవార్త భుజగీవిష మెక్కిన యట్టులెక్కినన్.
కమరిన యట్టులై నుదురు, కన్నులఁబాపలు తావు తప్పి, ము
చ్చెమటలుపోసి, మూర్ఛఁగొని సీత్కృతి లేచి, రయమ్ముగాఁగఁ గై
కమగది కేఁగి, నీలితెరగప్పి సుఖాసుఖనిద్రపోవుఁ గై
కమఁగని, కొంపమున్గిచను కైవడి పాదవిఘట్టయానయై.
శ్రీమద్రామాయణ కల్పవృక్షము, అయోధ్యా కాండము, అభిషేక ఖండములోని ఈ రెండు పద్యాలు మంథర పాత్రను అర్థం చేసుకోవటానికి ఉపయోగపడేటటువంటివి.
" శ్రీరామచంద్రుని అభిషేకం సంగతి కైక యొక్క అరణపు దాది మంథరకు ఇంకా తెలియదు. అయినా, ఆమెలో ఉన్న సహజ దైత్యగుణం పైకి వచ్చింది. ఆ సహజమైన, దైత్యగుణం వల్ల వచ్చిన కోపంతో, పరిచారికల ద్వారా రాముని అభిషేక వార్త తెలియగానే, ఒక్కసారిగా అది పాము విషం తలకెక్కినట్లు ఎక్కింది.
అంతే, ఆమె ముఖం కమిలిపోయినట్టయింది. కనుపాపలు ప్రక్కకు పోయినాయి. ఒళ్ళంతా చెమటలు పట్టింది. మూర్ఛలో నుండి తేరుకొని సీత్కారం మొదలుపెట్టింది. వడివడిగా నడుచుకుంటూ కైకమ్మ గదికి వెళ్ళింది. నీలితెరమధ్యలో, నిద్ర పట్టీ పట్టకుండా ఉన్న కైకను చూసి, కొంప మునిగినట్లుగా నేల మీద పెద్ద చప్పుడు చేస్తూ నడవసాగింది.. "
మంథర దైత్యగుణం ప్రధానంగా కల స్త్రీ. అందువల్ల, సర్వజనామోదమైన శ్రీరామచంద్రుని పట్టాభిషేక విషయయం ఆమెకు కంటకప్రాయమైంది.. దానికితోడు రాముడంటే ఆమెకు గిట్టదు. రాముడు ఆడుకొంటూ విసిరిన బంతి ఆమె కాలికి తగిలి గాయం చేసిందనేది ఒక బాహ్యకారణం. అయితే, ఈ బాహ్యకారణం, అభిషేకాన్ని ఆపకల్గేటంతటి బలమైన కారణం కాదు. అందువల్ల, కన్నబిడ్డ కంటె ఎక్కువగా ప్రేమించే రాముని అభిషేకాన్ని మాన్పించి, అతడిని వనవాసానికి పంపేటంతటి అంశం, మంథరలోని సహజ దైత్యగుణమనే ఒక తార్కిక హేతువును ఈ పద్యాలలో విశ్వనాథ కల్పించారు.
No comments:
Post a Comment