Sunday, 10 May 2020

సువర్ణ సుమన సుజ్ఞేయము - 396 (శ్రీమద్రామాయణ కల్పవృక్షము: బాలకాండము: అవతారిక)








అల నన్నయ్యకు లేదు తిక్కనకు లే దా భోగ మస్మాదృశుం
డలఘు స్వాదు రసావతార ధిషణాహంకార సంభార దో
గల బ్రాహ్మీమయమూర్తి శిష్యు డయినా డన్నట్టి దావ్యోమ పే
శల చాంద్రీమృదుకీర్తి చెళ్ళపిళ వంశస్వామి కున్నట్లుగన్.


కవిసమ్రాట్ విశ్వనాథ సత్యనారాయణగారి శ్రీమద్రామాయణ కల్పవృక్షావతారిక లోని పద్యానికీ పద్యమే సాటి. ఇలా ఎందుకనవలసి వస్తున్నదంటే, ఇందులో ప్రాచీనాంధ్ర సాహిత్యాకాశంలో సూర్యచంద్రు లనదగిన ఇద్దరు మహాకవుల ప్రస్తావన, గురుప్రశస్తి, అంతకు మించి స్వీయప్రతిభపై తనకున్న ప్రగాఢ విశ్వాసం, అన్నీ కలగలసి ఉన్నాయి పద్యం ఎంత ప్రజాదరణ పొందిందంటే, ఆయన ప్రతిభావ్యుత్తులను సంపూర్ణంగా అవగాహన చేసుకొన్న పండితులను, సద్విమర్శకులను, ఇంత పేరుప్రఖ్యాతులను గడించిన ఈయన  ఎవరబ్బా అని  ఆయన గురించి ఏమీ తెలియని, ఎవరో చెప్పగా విని ఆశ్చర్యపోయిన పామరులను, అసలు పద్యంలో గురువుగారిని పొగిడారా, తనను తాను పొగుడుకున్నారా అని పెదవి విరిచే ఆయనంటే పడని విమర్శకులను ఒకేవిధంగా ఆకట్టుకొన్న పద్యమిది.

విశ్వనాథవారి గురువుగారు చెళ్ళపిళ్ళ వేంకటశాస్త్రిగారుఆయన  చుట్టూ వలయంలాగా ఒక వెలుగు ప్రసరించి ఉందట వెలుగు ఆయన కున్న కీర్తిఅది శరత్కాల చంద్రుని యొక్క తెల్లని, చల్లని వెన్నెల వంటిదట. కీర్తి ఆవ్యోమాంతం.   భూమ్యాకాశలు పట్టనంతటిది. చాంద్రీమృదుకీర్తి తన  గురువుగారి కున్నట్లు   వేరెవరికీ లేదట..  ఆదికవి నన్నయ్యకు లేదు, కవిబ్రహ్మ తిక్కనకు లేదుదీనికంతటికీ కారణం వారికి తనంతటి  శిష్యులు లేరటఇంకా మాట్లాడితే, తనవంటి శిష్యు డుండటం అనేది ఒక  భోగవిశేషమట

మరింతకూ గురువుగారి కింత భోగం తనవల్లనే పట్టిందంటే, తనెంతటివాడో చెప్పాలి కదాఅదే చెపుతున్నారు విశ్వనాథ.

తాను అలఘువు. తానేమీ చిన్నా చితకా వాడు కాదటప్రతిభావ్యుత్పత్తులు పుష్కలంగా ఉన్నవాడుతాను సృష్టించిన   కావ్యాల్లో  రసావిష్కరణ చేసినవాడుధిషణాహంకారం కలిగినవాడుప్రతిభ వల్ల ఒనగూడిన స్వాభిమానం కలవాడుబ్రాహ్మీమయమూర్తి. విద్యాధిదేవత అయిన సరస్వతీదేవి రూపమే తాను.

ఇన్ని విశేషణాలున్న శిష్యులు నన్నయ తిక్కనాదుల కున్నారా? నన్నయ్యకు శిష్యులు లేరు. తిక్కనకు ఒక శిష్యుడున్నాడు. కానీ తిక్కన అంతటి ప్రతిభాశాలి అని  అనిపించుకోలేదుమరి తాను శతాధిక కావ్యనిర్మాత. గురువును మించిన శిష్యుడని పేరు తెచ్చుకొన్నవాడు.

విశ్వనాథకు అహంకారం ఎక్కువ అని ఆయనంటే పడని విమర్శకుల మాట అట్లా ఉంచితే, స్వయంగా చెళ్ళపిళ్ళ వేంకటశాస్త్రిగారు శిష్యునికి  జరిగిన సన్మాన కార్యక్రమంలో  ఏమన్నారో  చూడండి.

" నా మార్గంబును గాదు వీని దరయన్, నా తాత ముత్తాతలందే మార్గంబును గాదు. "

మహాకవులకు తాత ముత్తాతలు వారికి మార్గదర్శకులైన ప్రాచీన కవులే. " చదువు చెప్పినందుకు, తన ధోరణిలో వ్రాస్తున్నాడా అంటే, తన శైలి కాకపోగా, ప్రాచీనాంధ్ర మహాకవులెవరి శైలీ కాదు " అని చెళ్ళపిళ్ళ వేంకటశాస్త్రిగారు శిష్యుని యొక్క ప్రతిభను గురించి చెప్పినదాని కర్థంవిశ్వనాథవారి దొక విశిష్టమైన శైలి. వారి దొక విశిష్టమైన అహంకారంధిషణాహంకారంఅంతే.

పద్యం యొక్క అంతరార్థాన్ని గ్రహించటానికి   శ్రీరామకృష్ణమఠానికి చెందిన పరివ్రాజకులు శర్వానందస్వామి వారిచే వ్యాఖ్యానించబడిన  తైత్తరీయోపనిషత్తు శిక్షావల్లి లోని మూడవ అనువాకాన్ని పరిశీలిద్దాంఅదేమి చెబుతుందంటే

" అథాధి విద్యం| ఆచార్యః పూర్వరూపంఅన్తేవా న్యుత్తరరూపం |విద్యాసంధిః | ప్రవచనగుం సంధానం | ఇత్యధి విద్యం || " 

( ఆచార్యుడు మొదటి రూపము (అక్షరము) .  శిష్యుడు పై రూపము (అక్షరము). విద్య సంధిబోధనము సంధానము, కలుపునది. ఇది అధివిద్య మనబడినది. )

ఇది విద్యా ఉపాసనము.  

" సంహిత అంటే రెండక్షరాల కలయిక, సంధి. ఉదాహరణకు పరమ + ఈశ్వరః  = పరమేశ్వరఃఇక్కడ అకార ఈకారాలు కలిసి ఏకారమైంది. వేరుగా ఉన్న రెండక్షరాలు సంధి సూత్రం వల్ల యుక్తమౌతాయి. వీటి మధ్య ఒక క్రొత్త సంబంధం కలుగుతుందిబోధనాకుశలుడైన ఆచార్యుడు శిష్యునికి తెలిసిన   వ్యాకరణ సూత్రాన్నే ఆధ్యాత్మిక సాధనగా చేస్తాడు. బ్రహ్మాండంలో పరస్పర సంబంధం లేనట్లు కనపడుతున్న కొన్ని విషయాలు నిజంగా సన్నిహిత సంబంధం కల్గి ఉన్నవేనని ఉపాసనల ద్వారా స్పష్టం చేస్తాడు. చివరికి విశ్వమంతా ఒక్కటే వస్తువనే విషయ గ్రహణానికి దారితీస్తాయి. " 

దీనిని బట్టి, గురుశిష్యు లిద్దరూ లోకం దృష్టిలో వేరు వేరుగా కనపడుతున్నా, వారిద్దరూ ఒకే ఆధ్యాత్మిక చైతన్యంలోని రెండు పార్శ్వాలుఅందువల్ల, పద్యం, కవిసమ్రాట్టుల, చెరిపేస్తే చెరిగిపోని ప్రతిభను వెల్లడిస్తూనేగురువుగారైన చెళ్ళపిళ్ళవారి గొప్పతనాన్ని ఇనుమడింపజేస్తున్నది.

ఇంకొక విషయం. పద్యం చివరి పాదంలో ' స్వామి ' అన్న పదప్రయోగం కూడా పరిశీలింపదగ్గదిశిష్యునికి గురువు ఎప్పుడూ దైవమే. విశ్వనాథవారిదీ అదే భావం. ఇక అహంకారానికి  తావెక్కడిది?







No comments:

Post a Comment

ప్రియమైన పాఠకులకు నమస్కారపూర్వకంగా ఒక చిన్న మనవి. గూగుల్ వారు బ్లాగులో మార్పులు తేవటం వలన, వ్రాసిన దానిని, ఉన్నదున్నట్లుగా, పద్యపాద విభజన, పేరాగ్రాఫుల విభజనతో పోస్టు చేయటం కష్టంగా మారింది. ఇది బ్లాగులు నిర్వహిస్తున చాలామంది పడుతున్న ఇబ్బంది అని తెలియవస్తున్నది.. సాంకేతిక పరిజ్ఞానం శూన్యమైన నా వంటి వానికి మరీ ఇబ్బందిగా తయారయ్యింది. అయితే, జిజ్ఞాసువులైన పాఠకులు, నాతో పంచుకొనే ఆ రెండు ముక్కలకే ప్రాధాన్య మిస్తారు కానీ, అందచందాలకు కాదనే ప్రగాఢ విశ్వాసంతో, పద్యపాద విభజన ( \ ) గుర్తుతో, పేరాగ్రాఫు విభజన ( \\ ) గుర్తుతో, శీర్షిక ముందు, ( * ) గుర్తుతో, వివరణ ( + ) గుర్తుతో మీ ముందుంచుతున్నాను. ఇది ఇబ్బదికరమే. అయినా, పరిస్థితులు చక్కబడే వరకూ, ఇబ్బందిని సహృదయంతో భరిస్తారని ఆశిస్తున్నాను. * సువర్ణ సుమన సుజ్ఞేయము - 778 ( శ్రీమద్రామాయణ కల్పవృక్షము: సుందర కాండము: పూర్వరాత్ర ఖండము) \ఎవ్వరు వంపరాని ధను వీ దనుజేశ్వరుఁ డేగి వంపగా\ నొవ్వినయట్టిదాని నవనూతనబాలుడు వంచె రాముడా\ యెవ్వడు భార్గవుండు పరమేశ్వర శిష్యుడు మున్ను నిల్వ లే\ దెవ్వరు వానిముందుఁ బరమేశ్వరుడా రఘుమూర్తి తక్కగన్. \ \జనకజ చూడగా నతని శౌర్యము లోకువ కార్తవీర్యుఁ డ\ ర్జునుని పరాక్రమమ్మునకు శూరుడు రాముడు వేయిచేతులం \ దునఁ దనగొడ్డట న్నఱికె నూతన బాలుడు రాము నింక నే\ మనవలె సప్తతాళదళ నాద్భుతముల్ మలినాటి ముచ్చటల్. \ \ఈ యమ యెవ్వరో దితికులేశ్వరు నమ్మినచాన నిద్దురం\ బోయెడు వేళలో మొగలిపొట్టవలెన్ శయనించియున్న ద\ బ్జాయుత ముగ్ధముగ్ధ మధురాకృతి కాదని సీతయైన నీ\ తోయజనేత్ర కాదగును దూరపుభావన చేయకున్నచో.\ \అరరే కన్నుల వ్రేలు చున్నయది దుఃఖాంభోధి నిర్మగ్నయై\ తరుణీరత్నము సీత బ్రాతియుగ నిద్రాశూన్య రక్తాక్షియై\ సరగన్ వాక్కున రామ రామ యనుచు శబ్దించుచున్ మన్మనోం\ తర జీవంబువలెన్ నిరంతర దురంత ప్రౌఢ చింతామతిన్.\ + హనుమంతుడు లంకానగరంలో సీతాన్వేషణ చేస్తున్నాడు. పుష్పకంలో, నిద్రిస్తున్న స్త్రీలు కనుపించారు. అందులో ఒక దివ్యమైన ముఖకవళికలున్న స్త్రీని చూసి, సీత అని భ్రమపడ్డాడు. ఆ తరువాత, నిదానంగా తనలో తాను తర్కించుకొంటున్నాడు.\\ " ఎవ్వరూ వంచలేని శివధనుస్సును వంచటానికి వెళ్ళి, రావణాసురుడు భంగపడ్డాడు. అప్పుడు నూత్నయవ్వనంతో ఉట్టిపడుతున్న యీ రాముడు వెళ్ళి ధనుర్భంగం చేశాడు. పరమేశ్వరుని శిష్యుడైన భార్గవరాముడి ముందు ఒక్క దశరథరాముడు తప్ప యెవరూ నిలువలేకపోయారు.\\ జానకి దృష్టిలో రావణుని పరాక్రమం తక్కువ. ఇక కార్తవీర్యార్జునుని వెయ్యి చేతులను భార్గవరాముడు తన గొడ్డలితో నరికాడు. అటువంటి పరశురాముడి ముందు నిలబడగలిగిన యీ నూత్నయవ్వనంతో వెలుగొందే రాముడిని ఏమనాలి? ఏడు తాటిచెట్లను ఒక్క బాణంతో పెకలించిన అతడి ఆ తరువాత రోజుల్లోని ముచ్చట్లను గురించి యెంతని చెప్పాలి?\\ ఈ తల్లి యెవ్వరోగాని రావణుడిని నమ్ముకొన్న స్త్రీ. నిద్రపోయేటప్పుడు మొగలిపొట్టలాగా పడుకొని ఉంది. అంత లోతుగా పరిశీలన చేయకుండా ఉంటే, పద్మాల వంటి కన్నులు కలిగిన ముగ్ధమనోహరాకృతి సీతాదేవి ఒకవేళా ఈ దివ్యస్త్రీ అయితే కావచ్చునని అనుకోవటానికి ఆస్కారం ఉంది.\\ అయ్యో ! దుఃఖసముద్రంలో మునిగిపోయి, నిద్రలేకపోవటం వల్ల కళ్ళు ఎరుపెక్కి, నిరంతరం ' రామ, రామ ' అని రామనామస్మరణ చేస్తూ, రాముడే తన హృదంతర జీవమని, దుర్భరమైన శోకంతో ఉన్న సీతమ్మ తల్లి రూపం నా కళ్ళకు కనిపిస్తూ ఉంది కదా ! "\\ హనుమంతుడు నిత్య జాగరూకుడు. బుద్ధిమదగ్రగణ్యుడు. విచక్షణాశీలి. అందువల్ల, మొదట మండోదరిని చూసి సీత అని పొరపాటుబడ్డా, వెనక్కి తిరిగి మళ్ళీ ఆలోచించుకొన్నాడు. నిరంతరం రాముని భావనలో మునిగిపోయి, దుఃఖతో ఉన్న సీతమ్మ ఈమె యెట్లా అవుతుందని విశ్లేషించుకొన్నాడు.\\ ఈ పద్యాలు శ్రీమద్రామాయణ కల్పవృక్షము, సుందర కాండము, పూర్వరాత్ర ఖండము లోనివి.

like