ఉద్భవచ్ఛృంగమౌ యువకురంగము దడిఁ బొడిచి లోనికిఁ జూచిపోవుచుండ
నిస్తబ్దమౌ గాలి నిల్చి నిల్చి తరంగ భృతిఁ జెట్లపై ముర్మురించుచుండ
నపునప్డు రోమంధ మాపి పరున్న యాశ్రమగవి నిట్టూర్పు జార్చుచుండ
నడికిరే ఘూకస్వనము సిం హగర్జయు వదలి వేర్సవ్వడి మెదలకుండ
ధరణిసంతానమునకు నిద్రామనస్సు
స్వామి జాగ్రత్తపడి సతి పైని జేయి
చాచి మాటికి మాటికిఁ జూచుచుండఁ
బ్రభుసుఖాపాదిని గతించె రాత్రి యెల్ల.
శ్రీరామచంద్రుడు, సీత, లక్ష్మణునితో కలిసి అరణ్యవాసానికి వచ్చాడు. చుట్టుపట్లనున్న మున్యాశ్రమాలలోని మునులందరూ, యజ్ఞయాగాదులను ధ్వసం చేస్తూ, వారిని హింసిస్తున్న రాక్షసుల బారి నుండి రక్షించి ధర్మరక్షణ చేయమని రాముణ్ణి కోరుకున్నారు. వారందరికీ అభయమిచ్చిన రాముడు ఆ రాత్రి ఒక ఆశ్రమప్రాంతంలో, సీత, లక్ష్మణుడితో పాటు నిద్రకు ఉపక్రమించాడు. ఆ రాత్రి అరణ్యప్రాంతంలోని వాతావరణాన్ని విశ్వనాథ యీ పద్యంలో వర్ణించాడు.
" అప్పుడప్పుడే మొలుస్తున్న కొమ్ములతో ఒక యవ్వనంలో ఉన్న లేడి నేలలో తడిని పొడిచి లోపలికి పోతున్నది. నిశ్శబ్దంగా ఉన్న గాలి నిలిచి నిలిచి తరంగాలుగా చెట్లపై సవ్వడి చేస్తున్నది. ఆశ్రమం లోని గోవు అప్పుడప్పుడు నెమరువేయటం మాని నిట్టూర్పు విడుస్తూ ఉంది. అర్థరాత్రి సమయంలో గ్రుడ్లగూబ కూత, సింహగర్జన తప్ప వేరొక చప్పుడు వినిపించటంలేదు. భూమి మీద ఉన్న ప్రాణులన్నీ నిద్రావస్థలోకి జారుకున్నాయి. రాముడు జాగ్రత్త కోసమని భార్య పైన చెయ్యివేసి మాటికి మాటికి ఆమెవైపే చూస్తూ పడుకున్నాడు. ఆ విధంగా రాముని రక్షణలో, రాత్రంతా సుఖంగా గడిచిపోయింది. "
ఈ పద్యం శ్రీమద్రామాయణ కల్పవృక్షము, అరణ్య కాండము, దశవర్ష ఖండము లోనిది.
No comments:
Post a Comment