బంధురాత్మాత్మనస్తస్య యేనాత్మైవాత్మనా జితః |
అనాత్మనస్తు శత్రుత్వే వర్తేతాత్మైవ శత్రువత్ |
ఎవ్వడిల దను మనసు జయింపగలడో
ఆ మనస్సే తనకు తనకు " బంధు " వగును, మరియు
నెవడు మనసు నెంతయు జయింపలేడొ
యా మనస్సె , యాతని " శత్రు " వగుచు నిలచు.
మనస్సనేది ఇంద్రియాలను విషయ వ్యాపారాల వైపుకు ఆకర్షిస్తుంది. ఇంద్రియాలను నేర్పుగా, ఓర్పుగా వశపరచుకోలేని జీవుడిని, కామ, క్రోధ, లోభ, మోహ, మద, మాత్సర్యాలు, ధనేషణ, దారేషణ, పుత్రేషణమనే శత్రువులు చుట్టుముట్టుతారు. దానితో, సమత్వం నశించి, " నేను, నాది, నావారు " అనే సంకుచితత్వం మొదలవుతుంది. ఎప్పుడైతే సంకుచితత్వం మొదలవుతుందో, అది దుఃఖానికి కారణమౌతుంది. ఇది మొత్తం ఒక విషవలయం. ఈ విషవలయానికి మూలస్థానం మనస్సు. అదే విధంగా, ఎవడైతే ఇంద్రియాలను వశపరచుకొని, మనస్సును నియంత్రించ గలుగుతాడో, వానికి మనస్సు బంధువు లాగా మారుతుంది. అందువల్లనే, ఉపనిషత్తులు " మన ఏవ కారణం బంధమోక్షామి ఏవ చ (సంసారానికి కట్టిపడవేయటానికి, సంసారం నుండి విడిపించటానికి మనస్సే కారణం). అందుచేత, మనస్సు రెండువైపులా పదునైన కత్తి వంటిది. సరైన మార్గంలో పెడితే, అది మనకు బంధువుగాను, విచ్చలవిడిగా వదిలివేస్తే, శత్రువుగాను మారుతుంది.
బృహదారణ్యకోపనిషత్తు మనస్సు యొక్క యీ రెండు పోకడలను చక్కగా విశ్లేషించింది.
" కామ స్సంకల్పో విచికిత్సా శ్రద్ధాశ్రద్ధా ధృతిరధృతి ర్హ్రీథీ ర్భీరిత్యే తత్సర్వం మన ఏవ. ( కామము, సంకల్పం, సంశయము, శ్రద్ధ, అశ్రద్ధ, ధైర్యము. అధైర్యము, లజ్జ, బుద్ధి, భావము - ఇవి అన్నియు మనస్సే అయియున్నవి) "
వేమన కూడా, మనస్సును వేరుచేస్తే, బ్రహ్మానంద ప్రాప్తి ఏ విధంగా కలుగుతుందో చక్కగా చెప్పాడు.
" మనసులోన పుట్టె మాయ సంసారంబు
మనసు విరిగెనేని మాయ తొలగు
మనసు తొలగిననాడు మహి తానె బ్రహ్మంబు
విశ్వదాభిరామ వినుర వేమ ! "
అందువల్ల, మనస్సు చేత సృష్టించబడిన యీ మాయ తొలిగితే, ఆత్మదర్శనం కలుగుతుంది. ఆత్మదర్శనం కలిగిన జీవుడు దేవుడవుతాడు.
శ్రీకృష్ణునిచే అర్జునుడికి ఉపదేశింపబడిన ఈ శ్లోకం శ్రీమద్భగవద్గీత, ఆత్మ సంయమ యోగంలో ఉంది.
No comments:
Post a Comment