స్తుత్యము నైగమార్థపరిశుద్ధము తేజము సీత, సోమకా
పత్యనిభుండు రావణుఁడు, వాయుతనూజుఁడు మత్స్యమై సదా
గత్యుపమానమూర్తి కనగాఁ బొలుపొందెడు ఖేచరీ నరీ
నృత్య దుదారనేత్ర శఫరీ వియదర్ణవ మీఁదుచుండఁగన్.
హనుమంతుడు మహేంద్రగిరి నుండి లంఘించి సముద్రాన్ని దాటడానికి ఆకాశంలోకి ఎగిరాడు. ఆకాశమనే మహాసముద్రాన్ని యీదుతున్న హనుమ వర్ణనమే శ్రీమద్రామాయణ కల్పవృక్షం, సుందర కాండము, పూర్వరాత్ర ఖండములోని యీ పద్య భావం.
" స్తుతింపదగినది, వేదార్థముల యొక్క పరమతత్త్వము, మహాచైతన్యము సీతాదేవి. వేదములను అపహరించిన సోమకాసురుని వంటివాడు రావణుడు. ఆకాశమనే మహాసముద్రాన్ని యీదుతూ పోతున్న హనుమంతుడు, వాయువీధిలో నుండి చూస్తున్న దేవ, గంధర్వ, కిన్నర, కింపురుష, మానవ, శబరీ స్త్రీల నేత్రాలకు విందుగా , వేదోద్ధరణ చేసిన ఆదిమత్స్యములాగా కనిపించాడు. "
సీతామహాదేవి గవేషణను (దేనికోసమై వెదుకవలెనో దానిని వెదకుట) విశ్వనాథవారు పలు రీతులలో దర్శించారు. సీత వేదవతి. వేదముల యొక్క పరమ ప్రామాణ్యము ( నైగమార్థ పరిశుద్ధము తేజము). అందువలన, సీతను అపహరించిన రావణుడు ' సోమకాపత్యనిభుడు ' గాను, సీతాన్వేషణకై బయలుదేరిన వాయుతనూజుడు ఆదిమత్స్యంగా భాసిల్లటం ఎంతో హృద్యంగా ఉంది.
No comments:
Post a Comment