కన్నుల నత్తరుల్ బుగులు కాటుక బెట్టుము, పైడిచీర లె
న్నెన్నియొ పెట్టె దీసి ధరియింపుము, నచ్చినవాని నెల్ల క్రొం
జెన్నుల భూషణాళి గయిసేయుము, పూతహవిః ప్రదానవే
ళ న్నిను జూడగా నదితిలాగున శ్రీహరి యెంచగావలెన్.
ఇపు డేమఱకుము హరి లో
భ పెట్టవలయు మనకడుపుపంట కతని రా
క పదింతలు ఫలమిచ్చెడు
సుపరీక్షితమార్గమెల్ల జూడగ వలయున్.
అను పతి మాటలం దనిసి యాయమ వెన్నుడు వచ్చునేని, యా
మునిపతి తెచ్చునేని, నవభూషలు జీరలు దాల్చి యెంత వె
న్నుని దనియింతు; నాదగు కనుంగొన లొత్తిన బత్తి జూచి మ
న్నన బొనరింపగావలె సనాతను డాద్యుడటంచు బల్కగన్.
ఇది శ్రీమద్రామాయణ కల్పవృక్షము, బాలకాండము, ఇష్టి ఖండము లోనిది.
పుత్రసంతానం కోసం పరితపిస్తున్న దశరథుడు అశ్వమేధ యాగం చేయడానికి సంకల్పించాడు. కులగురువు, పురోహితుడు, భగవంతుడు అయిన వసిష్ఠులవారిని సాదరంగా రప్పించి, క్రతుయత్నాలను ఆరంభింపజేసాడు. క్రతువు చేయించి, మంత్రప్రభావంతో నారాయణుడిని పుత్రుడిగా పొందేటట్లు చేస్తానని బ్రహ్మర్షి అభయమిచ్చాడు. పట్టరాని సంతోషంలో మునిగిపోయిన దశరథుడు పట్టపురాణి కౌసల్య గృహానికి వచ్చి, ఆమెను శ్రీహరి రాకకు మార్గం సుగమం చేయమని చెప్పటమే యీ పద్యం యొక్క విశేషం.
" కౌసల్యా! కళ్ళకి చక్కగా సువాసనలు వెదజల్లే కాటుక పెట్టుకో. పెట్టెలో దాచుకొన్న బంగారపు జరీ చీరలన్నీ కట్టుకో. నీకు నచ్చిన నగలన్నీ పెట్టుకో. యజ్ఞహవిస్సును అందుకొనేటప్పుడు, నిన్ను చూడగానే, శ్రీమన్నారాయణుడికి నువ్వు తన తల్లి అదితిలాగా కనుపించాలి. ఇటువంటి సమయంలో ఏమరుపాటు కూడదు సుమా! బాగా ఆశ పెట్టాలి. మన కోరిక నెరవేరి పదిరెట్ల ఫల మివ్వాలంటే, అతడి రాకకు ఏ అవరోధం కలుగకుండా చూడాలి. "
ఉద్వేగానికి లోనయి భర్త చెప్పిన మాటలకు తృప్తిచెందిన కౌసల్య, నిజంగా ఆ శ్రీమన్నారాయణుడు వచ్చేటట్లుంటే, బ్రహ్మర్షి వసిష్టులవారు తెచ్చేటట్లయితే, ఆద్యుడు, అనంతుడు, సనాతనుడైన శ్రీహరిని నా కళ్ళలో కనిపించే భక్తిభావంతో తృప్తిపరచాల్సిందే గాని, ఎన్ని రకాల చీరలు, నగలు పెట్టుకొంటే ఆ వెన్నుడి మన్నన పొందగలను? "
ఈ పద్యాలలో సంతోషంతో ఉక్కిరిబిక్కిరౌతున్న దశరథుడిని, నిర్మలమైన భక్తిభావంతో పండిపోయిన కౌసల్యను అద్భుతంగా చూపించారు విశ్వనాథ.
No comments:
Post a Comment