ధనవంతుండగు మానవుండు గడఁకన్ ధర్మోపకారంబులన్
ఘనతం జేయక యుండెనేని యమలోకంబందు సూచీముఖం
బను దుర్గతిఁ బట్టి త్రోచి నిధిఁ గాపై యున్న భూతం బటం
చును బాశంబులఁ బట్టి కట్టి వడితో నొప్పింతు రత్యుగ్రులై.
శుకమహర్షి పరీక్షిన్మహారాజుకి నరకలోక విశేషాలు, పాపాలు చేసిన వారికి పడే అనేక విధాలైన శిక్షలను గురించి చెబుతున్నాడు.
శ్రీమదాంధ్ర మహాభాగవతము, పంచమ స్కంధము లోని యీ పద్యంలో సూచీముఖమనే నరకలోక శిక్షను గురించి చెబుతున్నాడు.
" ధనవంతుడై ఉండి కూడా, ధర్మకార్యాలు, దానధర్మాలు చేయకుండా ఉన్నట్టయితే, అటువంటివాడు యమలోకం లోని సూచీముఖమనే నరకంలో త్రోయబడతాడు. అక్కడ యమభటులచే " నిధికి కాపలా ఉన్న భూతమా ! " అని నిందింపబడుతూ, త్రాళ్ళతో కట్టివేయబడి, బాధింపబడతాడు. "
మానవజీవితం పరోపకార పరాయణమై ఉండాలి. మనిషన్నవాడు తాను బ్రతుకుతూ, పదిమందిని బ్రతికించాలి. భగవంతుని దయతో లభించిన సంపదతో, సత్రాలు, పాఠశాలలు, ఆరోగ్యకేంద్రాలు పెట్టటం, బావులు త్రవ్వడం, వ్యవసాయ వనరులు సమకూర్చటం వంటివి చేయాలి. లేకపోతే మానవ జీవితానికి అర్థం, పరమార్థం లేదు. సంపాదించిన ధనాన్ని కూడబెట్టి, తనకు, తనవారికంటూ, తరతరాలకు మిగల్చడం, దయ్యాలు చేసే పని. బ్రతికి ఉన్నంతకాలం తాను అనుభవించకుండా, మానవసేవకు ఉపయోగించకుండా, తనువు చాలించినవాడు, ధనంపై మోజు తీరక, పిశాచజన్మ నెత్తి, ఆ నిధికి కాపలా కాస్తుండటం మనం చాలా కథల్లో చదువుతుంటాం. అందుకే యమకింకరులు " నిధికి కాపలా కాసే భూతమా ! " అని నిందావాక్యాలు పలుకుతారని పద్యంలో చెప్పబడింది.
స్వర్గనరకాల సంగతి అలా ఉంచితే, ఈశావాస్యోపనిషత్తులో చెప్పబడినట్లు , ఈ చరాచర ప్రపంచమంతా పరమాత్మునిచే వ్యాపించబడింది. అందువల్ల, ఈ ప్రపంచంలో " నీది, నాది " అనే ప్రసక్తి లేనే లేదు. ఈ భావనతో , మానవుడు తనకు ఉన్నదానితో సంతృప్తి చెందుతూ, తనకు మించిన ధనాన్ని, త్యాగభావంతో మానవసేవకు ఉపయోగించాలనేది, ఈ స్వర్గ నరకాల ఆంతర్యంగా భావించవచ్చు.
No comments:
Post a Comment