తన మృదుజిహ్వపై రవలు దాల్చిన నూగు నిగారపుం జిగుల్
చను కవితాసతిన్ విడచి సాధుమహాహవశీలుడౌ మహా
త్ముని యసిలేనిసేనఁ బడి పోయెడువానిఁ గొడాలి యాంజనేయుని మును నాకు జంటకవియున్ బ్రియమిత్రము సంస్మరించుచున్
ఆతడు నేనే కాదిది
మా తండ్రులు కూడ జెలులు మఱి యాతనితో
నాతో సాఁగిన కావ్యము
రీతి యందుండెడిది మధుఝరీ భ్రమరరుతిన్.
ఆతఁడె తోడు కల్గినను నచ్చముగాఁ గలకండ లచ్చులుం
బోఁతలుపోసి యుండెదము పోతనగారి విధాన, దీపితా
లాతమువోలె సుంతయు విలంబన మోర్వదు నిత్యవేగి నా
చేతము శబ్ద మేరుటకుఁ జిన్నము నిల్వదు భావతీవ్రతన్.
శ్రీమద్రామాయణ కల్పవృక్షావతారికలో కవిసమ్రాట్టులతో " సత్యాంజనేయకవులుగా' జంట కవిత్వం చెప్పిన, వారి ప్రియమిత్రుడు కొడాలి ఆంజనేయులుగారి విశేషా లున్నాయి.
విశ్వనాథ సత్యనారాయణగారు కవిత్వం చెపుతున్న ప్రథమ దశలో, కొడాలి ఆంజనేయులుగారితో (1897-1982) కలిసి అష్టావధానాలు చేసేవారు, జంటకవిత్వం చెప్పేవారు. ప్రియమిత్రుడు కొడాలి ఆంజనేయులుగారిని స్మరిస్తూ చెప్పిన ఈ మూడు పద్యాల విశేషాలను ఒకసారి పరిశీలిద్దాం..
" తన నాలుకపై నుండి వాక్సుధలను చిందించే కవితాసతిని విడిచిపెట్టి, అహింసావ్రతాన్ని చేపట్టిన శాంతికాముకుడు మహాత్ముని సత్యాగ్రహ పోరాటంలో దేశసేవకు అంకితమైన నా ప్రియమిత్రుడు, నాతో కలిసి కవిత్వం చెప్పిన కొడాలి ఆంజనేయులుని స్మరిస్తున్నాను.
అతడే కాదు, మా తండ్రులు కూడా మంచి స్నేహితులు. మరి అటువంటి ప్రియమిత్రునితో కలిసి రామాయణ కావ్యరచన సాగిఉన్నట్లయితే, ఆ కవిత్వంలో మధువు కోసం పూవుల చుట్టూ తిరిగే తుమ్మెద పాటల వంటి నాదసుఖం, తియ్యదనం ఉండేది.
నిజంగా నా ప్రియమిత్రుడే కావ్యరచనలో నాకు తోడుగా ఉండివుంటే, పోతనగారిలాగా మేము కలకండ అచ్చులు పోతపోసినట్లు రామాయణాన్ని తీర్చిదిద్దేవాళ్ళము. భావావేశం వల్ల, నా మనస్సు, శబ్దాన్ని ఎంచుకొనటానికి కొంచెం కూడా వ్యవధిని సహించదు. "
పై పద్యాలలో, ప్రియమిత్రుడిని స్మరించుకొనే సంస్కారం పాటు, విశ్వనాథవారి వినయసౌశీల్యం, స్నేహానుబంధం అవగతమౌతున్నాయి. మరొక విషయం, విశ్వనాథవారి జీవలక్షణం. ఆయన గాఢప్రతిభుడు, భవ్యకవితావేశుడు. ప్రతి అంశాన్ని అంతర్నేత్రంతో చూసే దార్శనికుడు. ఆయనది ఋషుల కులం. అందువల్ల, ఆయన నోటినుంచి శబ్దాలు జాలువారుతాయే కానీ, ప్రయత్నపూర్వకంగా వాటిని ఎంచుకొనడం జరుగదు.
విశ్వనాథరామాయణం తెలుగువారి కల్పతరువు. ఆ సురద్రువు (స్వర్గలోకపు చెట్టు) పోతనగారి కలకండ అచ్చులను పోతపోయడంతో పాటు, నన్నయగారి ప్రసన్న కథాకలితార్థయుక్తిని, శిల్పపు తెనుగు తోటయైన తిక్కనగారి కవితాసౌరభాన్ని, ఎఱ్ఱనగారి సర్వమార్గ సృష్టిని, శ్రీనాథుని రసప్రవాహాన్ని, పెద్దన వడపోసి ఇచ్చిన చెరుకురసం వంటి కావ్య లక్షణాలని, కృష్ణదేవరాయలవారి అనన్యమైన ప్రౌఢకవిత్వ లక్షణాలను, తెనాలి రామకృష్ణుని పదగుంఫనాన్ని, చివరగా నాచన సోముని నూతన గుణ సనాధత్వాన్ని, ఎవరికేది కావాలంటే దానిని పంచిపెడుతుంది.
శ్రీమద్రామాయణ కల్పవృక్షము చదువని సాహిత్యప్రియుల సాహిత్యాభిలాష అసంపూర్ణమేమో?
No comments:
Post a Comment