మృదుపిశంగజాంబూనదమృష్టలోమ
సమితి చిక్కణ వినిభృతాస్తరణమైన
నన్నదమ్ములు బుజములధివసించి.
సరగ నాగ్నేయమునకు నీశాన్యమునకు
వ్యాప్తమైన మహేంద్రచాపంబు కొసల
వరుణ పర్జన్యు లధివసింప నయి
నట్టులన్నదమ్ములు బుజముల నధివసించి.
పక్షి యెగురు దూకు వానరంబు బిది దూకి
నాడొ హనుమ యెగిరినాడొ తద్భు
జాగ్రసంస్థులయిన యన్నదమ్ములును సు
గ్రీవబుద్ధు లవధరింపలేదొ !
భిక్షుక వేషంలో రామలక్ష్మణులను కలిసి, సుగ్రీవునితో వారి మైత్రి సానుకూల పరిచాడు హనుమ. నిజరూపంలో వారినిద్దరినీ తన బుజాలపై నెక్కించుకొని సుగ్రీవుని వద్దకు తీసుకు వెళ్ళడానికి సమాయత్తమయ్యాడు. ఆ సన్నివేశంలోని హనుమ వర్ణనమే యీ పద్యాల విశేషం.
" అన్నదమ్ము లిద్దరూ హనుమ బుజాలపైన అధిరోహించారు. ఆ బుజా లెట్లా ఉన్నాయి? చాలా విశాలంగా, బలిష్ఠంగా ఉన్నాయి. నలుపు, బంగారం రంగులు కలబోతబోసినట్లుగా ఉన్నాయి. ఆ బుజాల మీద రోమాలు దట్టంగా పరచుకొని, అంత గరుకుగా గాక, మెత్తగా చక్కటి పరుపు లాగా ఉంది.
ఆ విధంగా విశాలంగా పరచుకొన్న హనుమ బుజాలు ఆగ్నేయదిక్కు నుండి ఈశాన్య దిక్కుకి విస్తరించిన ఇంద్రధనుస్సులాగా కనుపిస్తూ, దానిపై కూర్చున్న రామలక్ష్మణులు చెరొక ప్రక్కన వరుణదేవుడు, ఇంద్రుని లాగా ఉన్నారు.
ఇక హనుమ గమన వైఖరి ఎలాగుంది? పక్షి ఎగురుతుంది. వానరం దూకుతుంది. కానీ, రామలక్ష్మణులను బుజాలపై మోసుకెళ్తున్న హనుమ ఎగురుతున్నాడా లేకపోతే దూకుతున్నాడా అన్నది సుగ్రీవుని గురించి ఆలోచిస్తున్న రామలక్ష్మణులకు తెలియనంత సుతారంగా తీసుకువెళ్ళాడు. "
శ్రీమద్రామాయణ కల్పవృక్షము, కిష్కింధా కాండము, నూపుర ఖండము లోని పై మూడు పద్యాలు హనుమ బాహుబలాన్ని, గమన లాఘవాన్ని తెలియజేస్తున్నాయి.
No comments:
Post a Comment