వలనొప్పన్ దుదిఱెక్కమల్పులుగ నీపైనుండి యేతెంచు గా
లులు కర్పూరపరీమళాంబువులలో లోలంబులై వచ్చి న
ట్టులు మైతాకెడువేళ గుప్పు మను, గండూషించితో యట్టి నీ
ళ్ళులు లేదా యభిషేక మార్చితివొ స్వర్లోకాగురుస్రోతసిన్.
సముద్రాన్ని దాటి లంకా తీరానికి చేరుకొన్న శ్రీరామచంద్రుడు ఒకరోజు సముద్రపు అలల నురుగు పైనుండి వస్తున్న ఒక రాజహంసను చూసాడు. ఆ రాజహంస కొంతసేపు రాముని సమీపంలో తిరిగి, ఆకాశంలో గిరికీలు కొట్టడం మొదలుపెట్టింది. హంసను చూసిన మరుక్షణం నుంచి రాముని కెందుకో శివుడే హంస రూపంలో, జానకికి తన వియోగ బాధను తెలియజేయడానికి వచ్చాడనిపించింది. అంతేగాక, హిమవత్పర్వత ప్రాంతాల నుండి భార్యతో సహా ఎప్పుడైనా అయోధ్యాపట్టణ పరిసరాలకు వచ్చావా అని హంసను ప్రశ్నించాడు. ఆకాశంలో హంస పల్లటీలు కొడుతుంటే ఒక దివ్యపరిమళం వస్తున్నదని శ్రీరాముడు తలపోస్తున్నాడు.
" ఓ రాజహంసమా ! నీవు ఆకాశంలో గిరికీలు తిరుగుతున్నప్పుడు, నీ రెక్క అంచుల నుండి వస్తున్న గాలి, నా శరీరాన్ని తాకి, కర్పూరపు సువాసన గుప్పుమంటున్నది. ఒకవేళ, కర్పూరం కలిపిన నీటి నేమన్నా పుక్కిలించావా ఏమిటి? లేకపోతే, అగురు వాసనను వెదజల్లే స్వర్గలోకపు దివ్య గంగానదీ జలాల్లో స్నానం చేసి వచ్చావా? "
రాజహంసను గూర్చి చేసిన పై వర్ణన, హంసకు దివ్యత్వాన్ని, పవిత్రతను ఆపాదిస్తూ, శివుడే ఆ రూపంలో వచ్చాడని తలపోస్తున్న రాముని భావనకు బలాన్ని చేకూరుస్తున్నది. శ్రీమద్రామాయణ కల్పవృక్షము, యుద్ధ కాండము, సంశయ ఖండము లోని హంసదౌత్యము విశ్వనాథ కల్పనాచమత్కృతికి, రావణుని మనస్సులో సంశయ బీజాన్ని నాటటానికి, తద్వారా ఒక చక్కని మానసిక విశ్లేషణను ప్రవేశపెట్టడానికి అవకాశం కలిగించింది.
No comments:
Post a Comment