శ్రీ లొల్లా సుబ్బరామయ్యగారు
దేహినోస్మిన్ యథా దేహే కౌమారం యౌవనం జరా
తథా దేహాంతరప్రాప్తిర్ధీరస్తత్ర న ముహ్యతి.
కనగా జీవునకీ శరీరమున నక్కౌమారమున్ యవ్వనం
బును వార్థక్యమదెట్లు గల్గటులె చావుం బొందినన్ వీటినిం
గను దేహాంతరమందు, నట్టి తఱి జ్ఞానుండు నిక్కంబుగా
గనగా బోవడు మోహమింతయును నాకర్ణింపుమా, ఫల్గునా !
జీవులందరిలోను ఒకే ఆత్మపదార్థం వ్యాపించి ఉందన్న సత్యాన్ని తెలియచెప్పిన భగవానుడు, శరీరాన్ని విడిచిన తరువాత కూడా ఆత్మ నిత్యమై ఉంటుందని చెప్పాడు.
పుట్టిన ప్రతి జీవికి నాలుగు అవస్థ లుంటాయి. అవి, బాల్యం, యవ్వనం, వార్థక్యం, మరణం అనేవి. మొదటి మూడు మార్పులు జీవుడు ప్రత్యక్షంగా చూడగల్గుతున్నాడు. మరణం అనేది ఉందని తెలిసినా, అంత్యకాల అనుభవం అంతో ఇంతో కలుగుతుందేమో గాని, మరణాన్ని మాత్రం చూడలేడు. బాల్యం నుండి యవ్వనం లోనికి, యవ్వనం నుండి వార్థక్యం లోనికి జారిపోవటం ఎంత సహజమైన మార్పో, మరణం కూడా అంత సహజమైనదనే సత్యాన్ని జీవుడు గ్రహించలేకుండా ఉన్నాడు. అందువల్లనే, మరణించిన వారి కొరకు దుఃఖిస్తున్నాడు. యదార్థంగా, మరణానంతరం కనుపించని ఇంకొక అవస్థ ఉన్నదని భగవానుడు చెపుతున్నాడు.. అదే దేహాంతరప్రాప్తి. అంటే, జీవుడు ఈ శరీరాన్ని విడిచి ఇంకొక శరీరాన్ని ధరించటం. దేహాంతరప్రాప్తి ఉన్నదన్న సంగతీ జీవుడు స్థిరపరచుకోలేకుండా ఉన్నాడు. అంతమాత్రాన, ఆ మార్పు లేదని కాదు. పై నాలుగు మార్పులు ఎంత సహజమో, ఒక శరీరాన్ని విడిచిపెట్టిన తరువాత ఇంకొక శరీరాన్ని ధరించటం కూడా అంతే సహజం. అయితే, జ్ఞానులకు యీ రహస్యం తెలుసు. అజ్ఞానమనే పొరచే కప్పబడిన వారికిది తెలియదు. జ్ఞానులు, అతి సహజమైన యీ మార్పుకు దుఃఖింపరు. అవివేకులు దుఃఖిస్తారు. ఇద్దరి మధ్య ఉన్న తారతమ్యం ఇదే.
ఇక్కడొక తార్కికమైన ప్రశ్న పుడుతుంది. ఒక జీవుని యొక్క కనిపించే యీ నాలుగు మార్పులను బ్రతికియున్నవాడు చూడగలుగుతున్నాడు, మరణించిన జీవుడు చూడలేకపోతున్నాడు. అంతమాత్రం చేత, మార్పు లేదని అర్థం కాదు కదా! అదేవిధంగా, దేహాంతరప్రాప్తి కూడా సాపేక్షము. జ్ఞానులకిది ప్రత్యక్షము, సహజము. మోహంతో కూడుకొన్నవారి కిది అప్రత్యక్షము, అసహజము.
ఈ ప్రశ్నలకు సమాధానం అన్నట్లుగా భగవానుడు " ధీరస్తత్ర న ముహ్యతి " అని చెప్పాడు. జ్ఞానియైనవాడు ఆ విషయల్లో మోహానికి లోనుకాడని చెప్పాడు. అనగా, ఇవన్నీ సహజ పరిణామాలుగా జ్ఞాని అవగాహన చేసుకోగలుగుతాడు. అదే విషయంలో, అవివేకి దుఃఖానికి లోనవుతాడు.
ఇదీ శ్రీమద్భగవద్గీత, సాంఖ్యయోగంలోని పదమూడవ శ్లోకం.
No comments:
Post a Comment