తాన్యహం వేద సర్వాణి న త్వం వేత్థ పరంతప ||
అర్జునా ! నీవు నేను నీ యవని యందు
నెన్నియో సార్లు జన్మమ్ము లెత్తినాము
అన్ని జన్మల నెఱుగంగ నగును నాకు
కాని యెఱుగ జాలవు నీవు వాని నెపుడు ||
ఇది శ్రీమద్భగవద్గీత, జ్ఞాన యోగం అనే నాలుగవ అధ్యాయం లోని ఐదవ శ్లోకం. క్రింద ఇచ్చిన తెనుగు పద్యానువాదం ప్రాతఃస్మరణీయులు శ్రీ లొల్లా సుబ్బరామయ్యగారి ' గీతా దర్శనం ' అనే గ్రంథం లోనిది.
శ్రీకృష్ణ భగవానుడు అర్జునుడికి సాంఖ్య యోగం, కర్మ యోగం ఉపదేశించిన తరువాత, జ్ఞాన యోగాన్ని బోధించటం మొదలుపెట్టాడు.
జీవుడు కర్మలను ఆచరిస్తూ, వాటి ఫలితాలను ఆశించకుండా భగవదర్పణ చేసి, " నీవే తప్ప ఇతఃపరం బెరుగ" అని శరణాగతి పొందితే, చిత్తం నిర్మలమౌతుంది. అంటే, అప్పటికది, జ్ఞానాన్ని గ్రహించడానికి సిద్ధంగా ఉంటుంది. బంగారపు ముక్కను బాగా కరగిస్తే, దానిలోని మాలిన్యమంతా పోయి, మెరుగుదీరినట్లు, చిత్తంశుద్ధమౌతుంది. అర్జునుడికి జ్ఞాన యోగాన్ని బోధించటానికి ఇదే మంచి తరుణమని శ్రీకృష్ణుడు తలచి, చెప్పటం మొదలుపెట్టాడు.
" శత్రువులను తపింపజేసే ఓ అర్జునా ! నీకు, నాకు, ఇప్పటికి ఎన్నో జన్మలు గడచిపోయాయి. గడచిపోయిన జన్మల గురించి నాకు తెలుసు. కానీ, అవి నీకు తెలియవు. "
పరమాత్మ, ఆత్మ అభిన్నములని సాంఖ్య యోగంలో తెలుసుకొన్నాము. కర్మ యోగంలో పరమాత్మ యందు సర్వాత్మలను, సర్వాత్మల యందు పరమాత్మను దర్శించటం తెలుసుకున్నాము.
అయితే ఉపనిషద్వాక్యం ప్రామాణికంగా, పరమాత్మ ఏకమైనప్పటికీ, అనేక మవ్వాలని సంకల్పించాడు. తత్ఫలితమే ఈ జగత్తు. మరి సృష్టించిన ఈ జగత్తు యొక్క రక్షణ భారం వహించాలి కనుక, పరమాత్మ అనేక అవతారాలు ఎత్తాడు. బింబప్రతిబింబ భావంగా, పరమాత్మ స్వరూపమైన జీవుడు కూడా ఎన్నో జన్మలెత్తాడు. తాను చేసిన కర్మల ఫలితంగా ఇక ముందు కూడా ఎన్నో జన్మ లెత్తవచ్చు. అయితే, ఇక్కడ ఒక్కటే భేదం. అవతారమూర్తియైన పరమాత్మకు ఈ జన్మల పుట్టుపూర్వోత్తరాలన్నీ తెలుసు. ఇవేవీ జీవుడికి తెలియవు. దీనికి కారణం జగత్తు, మాయ అనే పొరచేత ఆవరింపబడి ఉండటం. పరమాత్మ మాయకు అతీతుడు. మాయను కప్పివేయ గలవాడు. జీవి మాయ చేత కప్పివేయబడేవాడు. పరమాత్మ సర్వజ్ఞుడు. జీవుడు అల్పజ్ఞుడు. ఇంతే తేడా ! జీవుడు ఎప్పుడు మాయను తొలగించుకొని, స్వస్వరూపజ్ఞానం పొందుతాడో, అప్పుడు ఈశ్వరుడౌతాడు.
అవతారము అంటే దిగిరావటం. దేవుడు, జీవుడిని ఉద్ధరించడానికి క్రిందికి దిగివస్తాడు. జన్మ లెత్తుతాడు. ఇప్పటి కెన్నో అవతారాలెత్తాడు. ఇక ముందు కూడా ఎన్నో అవతారలు ఎత్తవచ్చు. కానీ, ఈ పుట్టుకలన్నీ ఊర్ణనాభకృతాలు. సాలీడు తనకు తానుగా నిర్మించుకొన్న గూడు లాంటివి. పట్టుపురుగు తన చుట్టూ కట్టుకొన్న గూడు వంటిది. మహాత్ములు అవతారలక్ష్యం నెరవేరగానే, తాము నిర్మించుకొన్న ఉపాధిని ఛేదించుకొని, అవతార పరిసమాప్తి చేస్తారు. కానీ, సృష్టిజీవుల కథ వేరు. వారు కర్మజీవులు. వారికి జన్మలు, గతజన్మల కర్మ ఫలితంగా వస్తాయి. అందువల్లనే, అవతారమూర్తులకు గతజన్మల సర్వవృత్తాంతం తెలుస్తుంది. కర్మఫలితంగా జన్మించిన జీవులకు అవి తెలియవు. జీవులు ఆ ఎరుకను, భక్తి, జ్ఞాన, వైరాగ్యాల ద్వారా పొందాలి.
ఈ శ్లోకంలో ' పరంతప ' అని అర్జునుడిని సాభిప్రాయంగా సంబోధించాడు శ్రీకృష్ణుడు. శత్రువులను తపింపజేయ కలిగిన వాడైన అర్జునుడు, అంతఃశత్రువులను, ముఖ్యంగా మోహాన్ని, జ్ఞానాగ్నిచే దగ్ధం చేయాలనే సూచనను భగవానుడు అధ్యాయం ప్రారంభంలోనే చేశాడు.
No comments:
Post a Comment