చెలువుగ యౌవరాజ్య మభిషేకమిదేమిటి ఱేపు ప్రొద్దునన్
వెలువడి నీవు సద్వ్రతము వీటనుబుచ్చి యిదేమిరాక? లో
కులు నను నాడిపోసెదరు కుఱ్ఱను సద్వ్రతభంగ కారిణిం
బలె మఱి యేమి ముంచుకొనివచ్చినదీ నడి రాత్రివేళలో.
శ్రీరాముని పట్టాభిషేకానికి అన్ని ఏర్పాట్లు జరుగుతున్నాయి. రాముడు వ్రతదీక్షలో ఉన్నాడు. ఆ రాత్రి సమాధి స్థితిలో ఉండగా, దేవతలు కనిపించి, పట్టాభిషేకం చేసుకోవద్దన్నట్లు, రాముని అవతార లక్ష్యం గుర్తుచేసినట్లు అనిపించింది. వెంటనే రాముడు తన పినతల్లి కైకేయి వద్దకు వెళ్ళి ఆమెతో స్వప్నవృత్తాంతం మొత్తం చెప్పాడు. అప్పుడు ఆమె ఇలా అంటున్నది.
" చక్కగా రేపు పొద్దున్నే నీకు యౌవరాజ్య పట్టాభిషేకం జరుగుతుంటే, అదంతా వీధి పాలు చేసి నువ్వు ఇట్లా రావడమేమిటి? లోకులు, " అమ్మా ! వ్రతదీక్షలో ఉన్నవాడు ఇట్లా రాకూడదని నువ్వన్నా చెప్పొద్దా? అంటారు, నీ వ్రతదీక్షను పాడుచేసానని నన్ను ఆడిపోసుకుంటారు. ఏం మునిగిపోయిందని ఇంత అర్థరాత్రి వేళ వచ్చావు?
సమాధిలో ఉన్న రామునికి దేవతలు కనపడి అతని అవతార లక్ష్యాన్ని గుర్తుచేయటమన్నది విశ్వనాథవారి అద్భుత కల్పన. ఈ కల్పన రామావతార పరమ ప్రయోజనానికి ఒక హేతువును కల్పిస్తుంది. రాముడు స్వప్నవృత్తాంతాన్ని చెప్పటానికి కైకేయీగృహానికి వెళ్ళడం అంతర్గతంగా సర్వదేవతల, ఋషుల భావనగా అనుకొనవచ్చు.
ఈ పద్యం శ్రీమద్రామాయణ కల్పవృక్షము, అయోధ్య కాండము, అభిషేక ఖండము లోనిది.
No comments:
Post a Comment