తమ్ముఁడు నందెలే యెఱఁగుఁ దమ్ముఁడుఁ గాడొక దైవమీతఁడీ
క్రమ్మిన బాష్పరోధమునఁ గాంచఁగఁ జాలను భూషణచ్ఛవుల్
తమ్ములనిచ్చె నాకు మఱి దైవము జానకి నిచ్చె నాకు నీ
తమ్ములు దేవతాసములు తన్వియు దైవత లోకరత్నమై.
భూసుత స్త్రీజగత్తునకు భూషణ మాయమ భూషణంబులన్
భాసురముల్ కనుంగొనెడు భాగ్యము కంటెను భాగ్యమున్నదే
యీ సొబగైన భూషణము లెవ్వఁడు చూపెను వాఁడె మిత్రమా
నీ సొబగైన భూషణము నెవ్వఁడు గుర్తిడె వాఁడె తమ్ముఁడౌ.
రామసుగ్రీవుల మైత్రీబంధం ఏర్పడిన తరువాత, ఋష్యమూకం మీద సీత జారవిడిచిన నగలను సుగ్రీవుడు చూపించాడు. చీరకొంగు చింపి కట్టిన ఆ నగలమూటను చూడగానే రామునికి దుఃఖం పొంగుకొచ్చింది. అందువల్ల, నగలను సరిగా పోల్చుకోలేకపోయాడు. లక్ష్మణుడు ఉభయసంధ్యలలోను సీతమ్మ పాదాలకు నమస్కరిస్తాడు కాబట్టి, తల్లి కాలి అందెలను గుర్తుపట్టాడు. ఈ దృశ్యాన్ని చూసిన రామునికి, సోదరుల యొక్క, జానకి యొక్క సౌశీల్యం ఒక్కసారిగా మనసులో మెదిలి, ఇలా అన్నాడు.
" తమ్ముడు లక్ష్మణుడికి ఒక్క కాలి అందెలే తెలుసు. లక్ష్మణుడు నాకు తమ్ముడే కాదు, దైవసమానం. కళ్ళలో నీరు క్రమ్ముకోవటం వల్ల, ఆభరణాలు సరిగా చూడలేకపోయాను. ఇటువంటి దేవతాసమానులైన తమ్ముళ్ళను, దైవతలోక రత్నమైన భార్యను, దైవం నాకు ప్రసాదించాడు.
సీత స్త్రీలోకానికి ఆభరణం వంటిది. అటువంటి సీత ఆభరణాలను చూసే భాగ్యం కంటె వేరొక భాగ్యం ఉందా ? ఈ అందమైన ( మంగళప్రదమైన) ఆభరణాలను ఎవడైతే చూపాడో, వాడే నిజమైన మిత్రుడు, ఇంతటి అందమైన (పూజార్హమైన) కాలి అందెలను ఎవడైతే గుర్తుపట్టాడో, వాడే తమ్ముడు. "
పై పద్యాలు శ్రీరామచంద్రుని భావోద్వేగాన్ని తెలియజేస్తున్నాయి. సీతారాముల దాంపత్యం ఒక విడదీయరాని, విడదీయలేని తత్వం. అందువల్ల, తత్త్వస్వరూపిణియైన సీత ఆభరణాలకు శ్రీరాముడు అంత ప్రాధాన్యాన్ని ఆపాదించాడు. ఆమె ఆభరణాలు ఆమె ఉనికికి గుర్తు.
ఈ పద్యాలు శ్రీమద్రామాయణ కల్పవృక్షము, కిష్కింధా కాండము, నూపుర ఖండము లోనివి.
No comments:
Post a Comment