నన్నయ్యయుఁ దిక్కన్నయు
నన్నావేశించిరి పరిణాహమనస్సం
ఛన్నత వారలు పోయిన
తెన్నున మెఱుఁగులను దీర్చి దిద్దుచుఁ బోదున్.
అంతయొ యింతయో తెలిసినట్టి విమర్శకులైన కావ్యసి
ద్ధాంతుల యొత్తిడింబడి మహాకవి నాఁగెటిచాలు దీర్చుఁగా
లాంతరకీర్తి వృష్టిగతమై చను లాభము నెంచుచున్ లలా
టంతప రూక్ష చింతన నటన్మధుభారతి సస్యధారణిన్.
శ్రీమద్రామాయణ కల్పవృక్షావతారికలో విశ్వనాథ తన కావ్యరచనా రీతిని వివరించారు.
ఆదికవి నన్నయ్య, కవిబ్రహ్మ తిక్కన్న తనను ఆవేశించారని, విస్తృతమైన తన మానసిక పరిధిలో, వారు పోయిన మార్గాన్ని అనుసరిస్తూనే, స్వతంత్ర ధోరణిలో తన రచనను తీర్చి దిద్దుతూ పోతానని చెప్పారు.
మహాకవి అనేవాడు, అంతో ఇంతో కావ్యలక్షణాలు తెలిసిన, విమర్శకులైన కావ్యలక్షణకారుల సిద్ధాంతానుసారం, కృషీవలుడు నాగటిచాలు తీర్చినట్లు, తన కావ్యరచనా వ్యవసాయం చేస్తాడు. వ్యవసాయదారుడు కనుక వర్షంపైన ఆధారపడి ఏ విధంగా దిగుబడిని ఎంచుకుంటాడో, ఆ విధంగా కవితాసరస్వతి ప్రపంచంలో, మహాకవి కీర్తిప్రతిష్ఠలు అనే ధాన్యసమృద్ధి, అతని ఫాలభాగంపై నాట్యమాడే శారదాదేవి అనుగ్రహం వల్ల కలిగిన తీవ్ర చింతనతో పొందుతాడు.
ఆదికవి నన్నయగారి మహాభారత రచనలో ప్రసన్న కథాకలితార్థ యుక్తి, అక్షరరమ్యత, నానారుచిరార్థసూక్తినిధిత్వము అనేవి ప్రధాన లక్షణాలు. ఇక తిక్కనసోమయాజి శిల్పరచనాపారంగతుడు. అదేవిధంగా, ఉభయభాషలలో సమానమైన ప్రతిభను కనబరచినవాడు. ఈ రెండు లక్షణాలను పుణికిపుచ్చుకొని, స్వతంత్రమార్గంలో " కావ్యానేక బ్రహ్మాండ స్రష్ట " కవిసమ్రాట్ విశ్వనాథ సత్యనారాయణగారు.
No comments:
Post a Comment