గాలకేయునకు శృంగారలీల
వైవస్వతునకు భ్రూవల్లరీనటనంబు
కరటిదానవునకుఁ కల్కిచూపు
పాశపాణికిఁ గుచప్రాంతోరుదర్శనం
బంధకాసురునకు నలతి నగవు
ధననాయకునకు నుత్కంఠావిశేషంబు
మహిషునకును నర్మమర్మకలన
గంధవహునకు సిగ్గు జలంధరునకుఁ
గలికితనము పావకునకుఁ గౌను బలికి
వలపు నటియించుచును వారవార తనకు
దాన వారికి వారికి నైన యట్లు.
అందఱను బ్రమవెట్టుచు నవ్వధూటి
యెవ్వరికిఁ దాను బ్రమయక యెడన యుండె
దానిపై వాలి చొక్కె నందఱ మనములు
గంధఫలి మీద వాలుభృంగముల పగిది.
దేవదానవులు పాలసముద్రం చిలికినపుడు అమృతం పుట్టింది. ఆ అమృత భాండాన్ని అంధకాసురుడు, కాలకేయుడు, మహిషాసురుడు మొదలైనవారు దొమ్మీ చేసే తీసుకొనిపోయి, వేరొకచోట వాళ్ళల్లో వాళ్ళు పంచుకోవడానికి సిద్ధమయ్యారు. దాయాదుల మధ్య అమృతం పంచుకోవటం కోసం వచ్చిన ఈ తగాదాను తీర్చి, పరిస్థితిని చక్కదిద్దే నేర్పు ఒక్క శ్రీహరికే ఉందనిచెప్పి, బ్రహ్మ, శివుడు ఆ పని ఆయనకు అప్పచెప్పి, వాళ్ళ త్రోవన వాళ్ళు అక్కడనుంచి వెళ్ళిపోయారు. అందరూ చూస్తుండగా, విష్ణువు కూడా అంతర్థానమయ్యాడు.
కొంతసేపటికి, " దివ్యాకారంబును, దివ్యమాల్యములు, దివ్యాలంకృతుల్, దివ్యవస్త్రాకల్పంబులు దివ్యగంధములు నాహా పుట్ట జేయంగ " ఒక నీలాంభోజపత్రాక్షి మెరుపుతీగలాగా ఆకాశం నుండి కైందకు దిగింది. అట్లా దిగిన ఆ సుందరాంగి, ఇరుపక్షాలవారిని తన హావభావవిలాసాలతో భ్రమలో పడవేసింది. దేవదానవు లిద్దరినీ చెరొక వైపున కూర్చుండబెట్టి:
" ఇంద్రుడితో పరిహాసపు మాటలు మాట్లాడుతూ. కాలకేయుడి వైపు లీలగా చూస్తూ శృంగారం ఒలకబోసింది. సూర్యుడికి తీగల్లాంటి తన కనురెప్పల నటనం చూపించి, గజాసురుడికి తన కలికితనాన్ని చవి చూపించింది. వరుణునికి, క్షణమాత్రకాలం తన స్తనముల, ఊరువుల ప్రాంత దర్శనం చేయించి, అంధకాసురుడి వైపు ఒక చిరునవ్వు రువ్వింది. కుబేరుడిలో ఉత్కంఠ రేకెత్తించి, మహిషాసురుడితో నర్మగర్భంగా మాట్లాడింది. వాయుదేవుడి దగ్గర సిగ్గంతా ఒలకబోసి, జలంధరుడికి ఎక్కడలేని ఆడతనాన్ని చూపించింది. అగ్నిదేవుడితో నయగారపు మాటలు మాట్లాడింది. వాళ్ళందరి మీద ప్రేమ నటిస్తూ, వాళ్ళందరూ తనకు కావలసిన వాళ్ళన్నట్లుగా, తను వాళ్ళందరి దానినన్నట్లుగా, అందరినీ మాయలో పడేసి, తాను మాత్రం వాళ్ళ మాయలో పడకుండా యెడంగా ఉంది. సంపెంగెపువ్వు మీద వ్రాలిన తుమ్మెదల లాగా, అందరి మనసులూ జగన్మోహిని మీద వ్రాలాయి. "
నిజానికి, సంపంగిపువ్వుకీ తుమ్మెదలకీ పడదు. అన్ని పూలలోని తేనెను త్రాగే తుమ్మెదలు, సంపంగి పువ్వు మీద మాత్రం వ్రాలవు. అంటే, ఆ సుందరాంగి అందరినీ ఊరిస్తున్నది కానీ, గాగన కుసుమం లాగానే ఉండిపోయిందని అర్థం.
ఈ సీస పద్యంలో శ్రంగారనైషధకర్త యొక్క శృంగారరసపోషణా చాతుర్యాన్ని, జగన్మోహిని పాత్రచిత్రణలో పుష్కలంగా చూడవచ్చు. జగత్తునే మోహింపచేయగల మోహిని రూపురేఖావిలాసాలు, దేవదానవు లిద్దరినీ మాయలో పడవేసిందంటే ఆశ్చర్యం లేదు.
ఈ పద్యం శ్రీనాథ కవిసార్వభౌముని హరవిలాసము అనే కావ్యం చతుర్థాశ్వాసంలో ఉంది.
No comments:
Post a Comment