తనతో గాల్వురు సాల గల్గు బలసంతానంబుతో బ్రీతి పు
త్రుని వీరోత్తము సోమదత్తు విలసద్దోర్దర్ప దుర్దాంతు బౌ
త్రుని భూరిశ్రవసుం గనుంగొనుచు నింద్రుం గ్రేణి సేయంగ నే
చిన పెంపొప్పగ బాహ్లికుం డరిగె నిశ్చింతంబునం బోరికిన్.
గౌరవప్రదమైన ఏ రంగంలోనైనా, మూడు తరాలవాళ్ళు, అంటే, తాత, తండ్రి, మనుమడు రాణించి అందరి మన్ననలు పొందుతూ ఉంటే, అది ఆ వంశానికి గర్వకారణంగా ఉంటుంది. ముఖ్యంగా, సైనికరంగంలో నయితే, మీసాలు మెలివేసి చెప్పే పరిస్థితి ఉంటుంది. అటువంటి సన్నివేశమే కవిబ్రహ్మ తిక్కన శ్రీమదాంధ్ర మహాభారతము, భీష్మ పర్వము, ప్రథమాశ్వాసము లోని ఒక మత్తేభవృత్తంలో చక్కగా చిత్రించాడు..
సంజయుడు యుద్ధ విశేషాలను ధృతరాష్ట్రునికి సవివరంగా చెపుతున్నాడు.
" ఎంతో కాల్బలంతో, బాహ్లికుడు, వీరాగ్రేసరుడైన తన కొడుకు సోమదత్తుడు వెంటరాగా, భుజబలంలో అజేయుడైన మనుమడు భూరిశ్రవసునితో, దేవేంద్రుణ్ణి తలదన్నే గొప్పతనంతో, యుద్ధభూమికి జంకు గొంకూ లేకుండా వెళ్ళాడు. "
మహాభారత యుద్దంలో పాల్గొనని రాజవంశం ఆనాడు లేదంటే అతిశయోక్తి గాదు. అటువంటి ఉత్తమ రాజవంశానికి చెందిన వృద్ధ వీరులలో బాహ్లికు డొకడు. ఇతడు ప్రతీపుని కుమారుడు. శంతనుడికి సోదరుడు. వీని కుమారుడు సోమదత్తుడు. సోమదత్తుని కుమారుడు భూరిశ్రవసుడు. ముగ్గురూ భీష్మునితో పాటు, కౌరవపక్షాన పోరాడటానికి యుద్ధరంగానికి కదలి వచ్చారు.
మహాభారత యుద్ధంలో పాల్గొన్న వృద్ధ వీరులలో బాహ్లికుడు, భీష్ముడు, భగదత్తుడు ప్రముఖులు.
No comments:
Post a Comment