నైవ కించిత్కరోమీతి యుక్తో మన్యేత తత్త్వవిత్ |
పశ్యన్ శృణ్వన్ స్పృశన్ జిఘ్రన్నశన్ గచ్ఛన్ శ్వపన్ శ్వసన్ ||
ప్రలపన్ విసృజన్ గృహ్ణన్నున్మిషన్ నిమిషన్నపి |
ఇంద్రియాణీంద్రియార్థేష్ వర్తంత ఇతి ధారయన్ ||
కనుచున్ దాకుచు మాటలాడుచును నాకర్ణించుచు న్నెంతయున్
గనులన్ మూయుచు విప్పుచున్ గనుచు నాఘ్రాణంబు గావించుచున్
గొనుచున్ బట్టుచు నిద్రజెందుచును మేల్కొంచున్ విసర్జించుచున్
దినుచున్ దిర్గుచు బట్టియున్ వదలుచున్ నన్వేషించుచున్ నెర్గుచున్.
తను శ్వాసంబులు సల్పుచున్ విడుచుచున్ దద్యోగనిష్ఠుండు దా
నిని నేనెంతయుజేయ నింద్రియములే నెక్కొంచు గర్మంబులన్
బనిగానెంతయు జేయుచున్నవనుచున్ భావించుచుండు న్నిజా
త్మను దానెప్పుడు నిశ్చయాత్ముడగుటన్ ధాత్రీస్థలిన్ ఫల్గునా !
శ్రీమద్భగవద్గీత, కర్మసన్యాస యోగం లోని ఈ రెండు శ్లోకాలు, ఆత్మవిదుడు, నిత్యం సాగించే జీవనవ్యాపారాలన్నీ తాను చేస్తున్నాననే స్పృహతో కాకుండా, నిష్కామ కర్మగా, భగవదర్పితంగా చేస్తాడని శ్రీకృష్ణ భగవానుడు చెబుతున్నాడు.
" ఆత్మతత్త్వం తెలిసిన జ్ఞాని, తాను చూస్తున్నా, వింటున్నా, తాకుతున్నా, వాసన చూస్తున్నా, తింటున్నా, నడుస్తున్నా, నిద్రపోతున్నా, ఊపిరి విడుస్తున్నా, మాట్లాడుతున్నా, వదిలిపెడుతున్నా, గ్రహిస్తున్నా, కళ్ళు తెరుస్తున్నా, మూస్తున్నా, ఇంద్రియాలు వాటి వాటి పనులు అవి చేసుకుపోతున్నాయే గానీ, తానేమీ చెయ్యడం లేదని, నిశ్చయబుద్ధితో ఉంటాడు. "
అంటే, ఆత్మతత్త్వం తెలిసినవాడు నిత్యం అసంకల్పితంగా జరిగే పనులు, తాను చేసే పనులు కూడా, తన ప్రమేయం లేకుండా ఇంద్రియాలు చేసుకుంటూ పోతున్నాయే తప్ప, తాను చేస్తున్నానని అనుకోడు. పైన జరిగే జీవనవ్యాపారాలన్నీ, నిష్కామ బుద్ధితో, భగవదర్పణంగా చేసుకుంటూ పోతాడు తప్ప, తను కర్తనని ఎప్పుడూ అనుకోడు.
బమ్మెర పోతనామాత్యుని శ్రీమదాంధ్ర మహాభాగవతం, ప్రహ్లాద చరిత్ర చదివితే, ఆత్మవిదుడు ఏ విధంగా ఉంటాడో అర్థమౌతుంది.
" పానీయంబులు ద్రావుచుం గుడుచుచున్ భాషించుచున్ హాస లీ
లా నిద్రాదులు చేయుచుం దిరుగుచున్ లక్షించుచున్ సంతత
శ్రీనారాయణ పాదపద్మ యుగళీ చింతామృతాస్వాద సం
ధానుండై మఱచెన్ సురారిసుతు డేత ద్విశ్వమున్ భూవరా! "
ప్రహ్లాదుని వంటి ఆత్మవిదుడు, తాను సాగించే జీవనవ్యాపారాల కన్నింటికీ సాక్షిగా ఉంటాడు తప్ప, కర్తగా మాత్రం భావించడని అర్థమవుతున్నది.
ఇదే విషయాన్ని శంకర భగవత్పాదులు, వారి శివమానసపూజలో చెప్పారు.
" ఆత్మా త్వాం గిరిజామతిః సహచరః ప్రాణా శరీరం గృహం
పూజా తే విషయోపభోగరచనా నిద్రా సమాధి స్థితిః
సంచారః పదయో ప్రదక్షిణవిధిః స్తోత్రాణి సర్వా గిరో
యద్యత్కర్మ కరోమి తత్తదఖిలం శంభో తవారాధనం. "
ఈ విధంగా, కర్తృత్వం లేకుండా, నిష్కామంగా, భగవదర్పిత బుద్ధితో, మన దైనందిన కర్మలను ఆచరించినవాడు, కర్మబంధాల నుండి విముక్తుడౌతాడు. అదే, గృహస్థాశ్రమంలోని వారికి సంసారతరణోపాయం, కర్మసన్యాస యోగం లోని మూలరహస్యం.
No comments:
Post a Comment