కన్నులు చీకులై సుతనికాయము బాలవిహారలీలలుం
జెన్నగు ప్రాయమొంది విలసిల్లు తెఱంగును జూడఁ గాన కి
ట్లున్నను బంధుకోటి సమయోచితలాలనఁ బల్కుపల్కులన్
విన్నవి వీనులిప్డు గొఱవిం దముఁ జూఁడినయట్ల పొక్కెడిన్.
సంజయుడు దుఃఖభారంతో, ధృతరాష్ట్రుడికి పద్దెనిమిదో రోజు యుద్ధ విశేషాలను చెబుతున్నాడు. శల్యుడు, శకుని, శకుని కొడుకు ఉలూకుడు మొదలైనవారంతా యుద్ధంలో మరణించారని చెప్పాడు. అటువైపు ధృష్టద్యుమ్నుడు, శిఖండి, ఉపపాండవులు అంతా మరణించారని చెప్పాడు. చివరికి అసలు సంగతి బయటపెట్టాడు. భీముడు తన ప్రతిజ్ఞ నెరవేర్చుకున్నాడని, అంతటి కురుసార్వభౌముడు తొడలు విరగ్గొట్టబడి నేలపై పడి ఉన్నాడని చెప్పాడు. దుఃఖాతిశయంతో మాటలు తడబడుతుండగా, ధృతరాష్ట్రుడు సంజయుడి వైపు చూసి, " పాండవులు అయిదుగురూ మరణించలేదని, నా కుమారులందరూ యుద్ధంలో మరణించారని నీవు చెప్పిన వార్త విని కూడా ఇంకా నా గుండె పగిలిపోలేదంటే, అది వజ్రమయమై ఉంటుంది " అని కుమిలిపోయాడు. ధృతరాష్ట్రుడు ఇంకా యిలా దుఃఖిస్తున్నాడు.
" నేను పుట్టుగ్రుడ్డి నవటం వల్ల, నా పిల్లలు చిన్నతనంలో ఆడిన ఆటలను, తరువాత వాళ్ళకు యవ్వనం వచ్చిన తరువాత, ఆ సౌందర్యాన్ని, చూడలేకపోయాను. కానీ బంధువులు వారిని ప్రేమతో బుజ్జగిస్తూ మాట్లాడే మాటలను విని సంతోషించేవాడిని. ఇప్పుడు నీ మాటలు విన్న తరువాత, నా చెవులను కొరవితో వాత పెట్టినట్లుగా ఉంది. "
వందమంది కొడుకులనూ పోగొట్టుకోవడం, అత్యంత బాధాకరమైన విషయమే. అయితే, ఇంత అనర్థం జరిగిన తరువాత కూడా, ధృతరాష్ట్రుని మనఃప్రవృత్తిలో మార్పు రాకపోవటం ఆశ్చర్యకరం. తన కొడుకులు పోయారన్న బాధ కన్నా, పాండవులు అయిదుగురూ బ్రతికే ఉన్నారన్న విషయం అతడికి హృదయశల్యంగా ఉన్నట్లు కనిపిస్తున్నది. సంజయుడి వద్ద ధృతరాష్ట్రుడు వెల్లడించిన దుఃఖంలో మోహం పాలు ఎక్కువగా ఉన్నట్లు కనిపిస్తున్నది.
ఈ పద్యం శ్రీమదాంధ్ర మహాభారతము, శల్య పర్వం, ప్రథమాశ్వాసంలో ఉంది.
No comments:
Post a Comment