ఇదె యొక పిన్నవాఁ డడరి యెక్కుడు మూఁకల క్రందుఁ దోలెడున్
గదుపుల వెల్చు గోపకుని కైవడి నంచు జనుల్ నుతింపఁ జే
సెద, విని మామ ప్రీతి విలసిల్లఁగఁ దండ్రియు సంతసిల్ల బె
ట్టిదుఁ డగు కౌరవేంద్రునకు డెప్పర మయ్యెడు భంగిఁ బేర్చెదన్.
అభిమన్యుడు వయసులో చిన్నవాడు. ఉడుకు రక్తం కలవాడు. భీష్మపర్వంలో చెప్పినట్లు ' కన్నెకయ్యం (మొదటిసారి యుద్ధం) చెయ్యబోతున్నాడు. అందుకని, అతని మాటలు ఉత్సాహభరితంగా ఉంటాయి. పద్మవ్యూహం ఛేదించడానికి ఉద్యుక్తుడవుతున్న అభిమన్యుడి ఆ నిండు ఉత్సాహాన్ని ఈ పద్యంలో చూడవచ్చు.
" ఇదిగో ! ఆవులమందలను తోలే గొల్లపిల్లవాడు ఆవులమందను ఏ విధంగా తోలుతాడో, ఆ విధంగా ఒక పిల్లవాడు యుద్ధరంగంలో రెచ్చిపోయి శత్రుసైన్యాన్ని చీల్చి చెండాడుతున్నాడని జనులు మెచ్చుకొనే విధంగా, యుద్ధం చేస్తాను. నా మేనమామ కృష్ణుడు, నా తండ్రి అర్జునుడు సంతోషించేటట్లు, అటువైపు దుర్యోధనుడు నా విజృంభణ తట్టుకోలేనట్లు వీరవిహారం చేస్తాను. "
ఈ సందర్భంగా, తిరుమల తిరుపతి దేవస్థానం వారు ప్రచురించిన ద్రోణపర్వం, ద్వితీయాశ్వాసానికి డాక్టరు మల్లెల గురవయ్యగారి విశేష వ్యాఖ్యను, వారికి కృతజ్ఞతాంజలులు సమర్పిస్తూ, ఇక్కడ పొందుపరుస్తున్నాను.
" గోవులను మళ్ళించటం అనేది ఇక్కడ ఉపమానంగా ప్రయోగించబడింది. కానీ, భారత యుద్ధం ప్రారంభం కాక ముందు ఆవుల మందలను వెనక్కు తోలటం ఒక మహావీరకార్యంగా నిరూపించబడింది. ముఖ్యంగా ఉత్తర గోగ్రహణ సందర్భంలో అర్జునుడు ప్రదర్శించిన అవక్రపరాక్రమం ప్రజలకూ, రాజుకూ, అందరికీ ఆనందాన్ని కలిగించింది. దుర్యోధనుడికి ఆనాటి సంఘటన దుస్సహంగా పరిణమించింది. సైన్యాన్ని కదుపులతో పోల్చటం వలన అర్జునుడి ఆనాటి పరాక్రమమాన్ని అభిమన్యుడిలో ఆరోపించినట్లయింది. గోపకులలో అతిముఖ్యుడు శ్రీకృష్ణుడు. ఆయనకు ఆలమందలను తోలటం ఒక సరదా. అది ఆయనకు ఎంతో ప్రీతికరం. అట్లాగే అభిమన్యుడున్నూ ఎంతో సరదాగా, అవలీలగా ఆలమందలను తోలినట్లు సైన్యాన్ని తోలాడన్ని చెప్పటం వలన పూర్వ విషయాన్ని స్ఫురణకు తెచ్చినట్లయింది. ' ఇదే ' అను ఎత్తుగడలో పద్యాన్ని ప్రారంభించి అది ఏ విధంగా పలువురికి సంభ్రమాశ్చర్య సంతోషాలను కలిగించిందో తిక్కన ఎంతో నాటకీయంగా సన్నివేశాన్ని మనకళ్ళముందు సాక్షాత్కరింపజేసాడు. "
ఈ పద్యం శ్రీమదాంధ్ర మహాభారతము, ద్రోణపర్వం, ద్వితీయాశ్వాసంలో ఉంది.
No comments:
Post a Comment