భూమిసురావళీమహిత భోజనతంత్రముఁ దీర్పఁ బూని హృ
ద్యామలరాజితంబులగు నట్లొనరించిన కూడుగూర లా
కోమలు లాఁగఁగా గడఁగి క్రోఁతుల కన్నియుఁ బంచివెట్టి రు
ద్దామవిహారలీల వసుధావర ! యాదవు లేమి సెప్పుదున్?
పదపడి గీత వాద్యగతిబంధురనృత్యము లుల్లసిల్లఁగా
నుదధికి సంచితాక్షత మహోత్తరగంధవిశిష్టపుష్ప సం
పదలు బహుప్రకారములఁ బ్రస్తుతి కెక్కఁగఁ బూజసేసి పెం
పొదవ నివేద్య మిచ్చిరి సముజ్జ్వలహృద్య పదార్థకోటులన్.
విను తదనంతరంబ మదవిహ్వలభావము చేయఁ జాలి యిం
పొనరిన యాసవంబులు సముత్సుకతం గనకంపుఁ గోరలం
గొని హరి సన్నిధానమునఁ గ్రోలిరి యాదవు లంతరంగ మో
దనకరణంబులైన యుపదంశములం గొనుచున్ మహీశ్వరా !
" శ్రీకృష్ణుని సూచన మేరకు యాదవులందరూ సముద్రతీరానికి చేరారు. యధావిధిగా బ్రాహ్మణ సంతర్పణ కోసం రుచికరంగా వండించిన పదార్థాలను, ఆడవాళ్ళు వద్దని మొత్తుకుంటున్నా వినకుండా, కోతులకు పంచిపెట్టారు. ఇక వాళ్ళు చేసిన పని ఏమని చెప్పాలి?
ఆ తరువాత, వాద్య పరికరాలను మ్రోగిస్తూ, అందరూ కలిసి నృత్యం చేశారు. పూలు, అక్షతలు సముద్రపు అలలపై చల్లారు. భోజన పదార్థాలను సముద్రుడికి నైవేద్యం పెట్టారు. తరువాత, బాగా మత్తు కలిగి గించే మద్యాన్ని బంగారు పాత్రలలో పోసుకొని, రుచికరమైన పదార్థాలను నంజుకుంటూ, శ్రీకృష్ణుని ఎదురుగానే తాగారు. "
శ్రీమదాంధ్ర మహాభారతము, మౌసల పర్వం లోని ఈ సన్నివేశం విధి ఎంత బలీయమైనదో తెలియజేస్తుంది. మునుల కోపానికి , గాంధారి శాపం తోడుకాగా, శ్రీకృష్ణుని కనుసన్నలలో చల్లగా వర్థిల్లిన యాదవకులానికి అంతిమ ఘడియలు దగ్గరపడ్డాయి. అంతా తెలిసిన శ్రీకృష్ణుడు లీలావినోదిగా చూస్తూ ఊరుకున్నాడు.
No comments:
Post a Comment