స్వామికి జ్ఞప్తియుండదు ప్రసన్నత కల్గదు, నిర్వికారస
త్తామహనీయవార్త్ధికిని, దానవసిం హము పంక్తికంధరుం
డేమయిపోయె, మా మనవు లేమయిపోయె భవత్ప్రతిజ్ఞ తా
నేమయిపోయె గోసలనరేశ్వరు యజ్ఞహవిస్సమాహృతిన్
ఏలికకున్ ధరావలయ మేలుట యిష్టమయేని వేలయేం
డ్లేలగవచ్చు నేడు జగ మేలగవచ్చును ధర్మకాష్ఠపై
వ్రాలిన దానవేశు నొక వాలికతూపున గూలనేసి యా
పై లసమానధాత్రిసతి పావన గర్భముతో సుఖింపుమా!
ఈ రెండు పద్యాలు కవిసమ్రాట్ విశ్వనాథ సత్యనారాయణగారి శ్రీమద్రామాయణ కల్పవృక్షము, అయోధ్యా కాండము, అభిషేక ఖండము నందలివి.
దశరథుడు రాముని పట్టాభిషేకానికి అన్ని ఏర్పాట్లు చేశాడు. సీతారాములను బ్రహ్మచర్యం పాటించి వ్రతదీక్షలో ఉండమన్నాడు. ఆ రాత్రి, రామునికి కలలో దేవతలు కనిపించి, ఈ విధంగా మొరబెట్టుకున్నారు.
" బహుశా స్వామికి జ్ఞాపకం లేదనుకుంటాము. అందుకనే మా మీద దయ కలగటం లేదు. ఎందుకంటే, స్వామి నిర్వికారుడైన శుద్ధసత్త్వస్వరూపుడు కదా! లేకపోతే లోకకంటకుడైన దశకంఠుని సంగతి మర్చిపోతాడా? అసలు మేమందరం మొరపెట్టుకొన్న సంగతి ఏమయిపోయింది? దశరథ మహారాజు యజ్ఞఫలంగా ఆయన కొడుకుగా పుట్టి తమ ప్రతిజ్ఞ నెరవేర్చుకుంటానని మా కిచ్చిన మాట ఏమయిపోయింది?
ఒకవేళ స్వామికి ఈ భూమిని పాలించాలని అంత కోరికగా ఉంటే, వేలకొద్దీ సంవత్సరాలు నిరభ్యంతరంగా రాజ్యం చేయవచ్చు. ఏడు లోకాలు ఏలవచ్చు. ముందుగా ధర్మహాని కలిగిస్తున్న ఆ దానవేశుడు రావణున్ని ఒక వాడిబాణంతో చంపి, ఆ పైన పట్టాభిషేకం చేసుకొని, భూజాని సీతతో సర్వసౌఖ్యాలు అనుభవించవచ్చు. "
పై రెండు పద్యాలు విశ్వనాథవారి కల్పనాచమత్కృతికి, వాల్మీకి రామాయణంలోని గ్రంథగ్రంథులను విడగొట్టిన తీరుకి నిదర్శనాలు. శ్రీరాముని అవతార లక్ష్యం, దానికై రచింపబడిన ప్రణాళిక, కైకేయీసముపజ్ఞముతో దానిని నిర్వహింపజేయడం, తద్వారా రామావతారానికి పరమార్థాన్ని సంతరించటం, అనేవి శ్రీమద్రామాయణంలో కీలకమైనవి. అందుచేత, విశ్వనాథ చేసిన యీ కల్పన ఒక అద్భుతమైన ప్రకియ కాగా, ముందు ముందు కైకేయి యొక్క మహోదాత్త పాత్ర చిత్రణకు ఉపకరణాలుగా మారాయి.
No comments:
Post a Comment