అంబుజసూతి యేర్పడ గృహస్థ సమర్హముగాఁ బ్రవృత్తి ధ
ర్మంబు నొనర్చె, నార్యజన మాన్యము దాని తెఱంగు చాల సూ
క్ష్మం బతి కాంక్ష లేక తగుకాలమునన్ సమచిత్తవృత్తి ని
త్యంబును ధర్మముఖ్యముగ నర్థముఁ గామముఁ జల్పు టొప్పగున్.
శివుడు పార్వతి అడిగిన అన్ని ప్రశ్నలకు ఓపికగా సమాధానం చెబుతున్నాడు. ఇంత వరకు ఆయన వానప్రస్థాశ్రమ విశేషాలను చెప్పాడు. ఇప్పుడు గృహస్థధర్మాలను చెపుతున్నాడు.
" సృష్టికర్త బ్రహ్మ గృహస్థుకు కావలసిన ప్రవృత్తి ధర్మాన్ని కల్పించాడు. దానిని పెద్దలందరూ ఆమోదించారు. అది చాలా లోతైన విషయం. పేరాశ లేకుండా, తగిన సమయంలో, తగినంత మేరకు, సముచిత మార్గంలో, ద్రవ్యాన్ని సంపాదించాలి, అట్లాగే, కోరికలను తీర్చుకోవాలి. అప్పుడే, అది ధర్మయుతమౌతుంది. "
గృహస్థాశ్రమం ఎక్కువమంది ఆచరింపదగినది, నాలుగు ఆశ్రమాలలోను ముఖ్యమైనది. గృహస్థాశ్రమంలో ధనం ప్రాముఖ్యత చాలా ఉంది. అయితే, అది గృహనిర్వహణకు, అతిథి అభ్యాగతుల సేవకు తగినంత మాత్రమే సంపాదించాలి. అది కూడా, సముచిత మార్గంలో సంపాదించాలి. అక్రమార్జన, అన్యాయార్జన ధర్మవిరుద్ధం. కామం కూడా అంతే. శాస్త్రవిహిత మార్గంలో, సృష్టి పరంపరను కొనసాగించటానికి, ధర్మకామాన్ని నెరపాలి. అదే గృహస్థ ధర్మం.
ఈ పద్యం, శ్రీమదాంధ్ర మహాభారతము, ఆనుశాసనిక పర్వం, పంచమాశ్వాసంలో ఉంది.
No comments:
Post a Comment