ఒరు లేమేమి యొనర్చిన
నరవర ! యప్రియంబు తన మనంబున కగుఁ దా
నొరులకు నవి సేయకునికి
పరాయణము పరమధర్మపథముల కెల్లన్.
ఇది చిన్న పద్యం. అందమైన కంద పద్యం. తిక్కన, సూక్తులను కందంలో ఒదిగించటంలో చెయ్యితిరిగినవాడని చెప్పాలి. దానికి ఈ పద్యమే చక్కని ఉదాహరణ.
ధర్మరాజు అంపశయ్య మీద ఉన్న భీష్ముడిని ధర్మసందేహాలను అడిగి తెల్సుకుంటున్నాడు. " సజ్జనులు ఎక్కడ ధర్మానికి భంగం కల్గుతుందోనని భయపడుతూ ఉంటారు. ఆ ధర్మం ఇంతగా పూజింపదగినంత గొప్పదా? " అని అడిగాడు. దానికి, భీష్ముడు ధర్మం యొక్క స్వరూపాన్ని ఏకవాక్యంలో, అరటిపండు వలిచి పెట్టినట్లు చెప్పాడు.
" ఇతరులు ఏమేమి చేస్తే తన మనస్సుకు అప్రియంగా ఉంటుందో, అటువంటి పనులను తాను ఇతరులకు చేయకుండా ఉండటమే ధర్మాల్లో కల్లా పరమధర్మం. "
మానవజాతిని తీర్చిదిద్దడానికి మహోన్నతమైన సందేశం ఇందులో ఇమిడి ఉంది. ఉదాహరణలుగా మనం ఎన్నైనా చెప్పుకోవచ్చు.
ఒకడు అకారణంగా మనల్ని తిట్టాడనుకుందాం. మనం చాలా బాధపడతాము. అటువంటి బాధ మనం ఇతరులకు కలిగించకుండా ఉండటమే ఉత్తమ ధర్మం. మన ధనాన్ని ఎవడో అపహరించాడు. ధనం పోయినందుకు మనం చాలా బాధపడ్డాము. మనం ఇతరుల ధనాన్ని ఆశించకుండా ఉండటమే పరమ ధర్మం.
ఊళ్ళలో ఒక మోటు సామెత చెబుతూ ఉంటారు. ఒక వైద్యుడన్నాడట, " ఇప్పటిదాకా ఇన్ని కంతులను కోశాను కానీ, నా కంతి అంత నొప్పి ఏదీ లేదు " అని. ఇది తెలిస్తే, ధర్మసూక్ష్మం అర్థమయినట్లే.
ఈ పద్యం శ్రీమదాంధ్ర మహాభారతము, శాంతి పర్వం, పంచమాశ్వాసంలో ఉంది.
No comments:
Post a Comment